బతుకు జీవుడా..!

Tourist Bus Fired in Road Accident Srikakulam - Sakshi

లారీని ఢీకొని టూరిస్టు బస్సు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల చెలరేగిన మంటలు

సురక్షితంగా బయటపడ్డ 45 మంది టూరిస్టులు

ప్రయాణికులంతా ఉత్తరాఖండ్‌ వాసులు

ఒక్కసారిగా పెద్ద కుదుపుతో బస్సు ఆగింది.. నిద్దట్లోనే ఒకరిపై ఒకరు పడ్డ ప్రయాణికులకు కాసేపు ఏమైందో అర్థం కాలేదు.. చుట్టూ అంధకారం.. సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడివున్నాయి. ప్రమాదం జరిగిందని తెలుసుకొని బిలబిలమంటూ దిగిపోయారు.. ఆ షాక్‌ నుంచి తేరుకొని సామాన్లు తెచ్చుకొనేలోపే కళ్ల ముందే బస్సు దగ్ధమైంది. ఆకాశాన్నంటిన అగ్ని కీలలను చూసి వారెవరికీ నోట మాట రాలేదు. రణస్థలం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బస్సులోనివారంతా ఉత్తరాఖండ్‌ రాష్ట్రం నుంచి వస్తున్న టూరిస్టులు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు.  

రణస్థలం: రోడ్డు ప్రమాదం ఒక షాక్‌.. మంటల్లో బస్సు దగ్ధం మరో షాక్‌.. అంతసేపు తాము ప్రయాణించిన వాహనమేనా ఇలా కాలి బూడిదైందని తలచుకుంటేనేఒళ్లు గగుర్పొడిచే సంఘటన అది.. అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులు, పోలీసులు, స్థానిక ప్రజలు వెంటనే సహాయ చర్యలందించడంతో వారు కాస్తంత తేరుకున్నారు.. అయితే సామాన్లన్నీ కాలిబూడిద కావడంతో ఊరుకాని ఊరిలో కట్టుబట్టలతో మిగిలారు. ఉత్తరాఖండ్‌ వాసులు ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆదివారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో దగ్ధమైంది. ముందు వెళుతున్న వరిశాం శ్యాం పిస్టన్స్‌ పరిశ్రమకు చెందిన బస్సు హఠాత్తుగా కుడివైపునకు మలుపు తిరగడంతో వెనుక వేగంగా వస్తున్న టూరిస్టు బస్సును గుద్ది అవతల రోడ్డులో ఉన్న అమ్మోనియం లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 45మంది ఉన్నారు. నిద్దట్లో ఉన్నవారంతా ఉలిక్కిపడి లేచి బస్సు దిగిపోయారు. ఇంతలో షార్ట్‌సర్క్యూట్‌ అయి బస్సు వారి కళ్ల ముందే పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులంతా చకచకా బస్సు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడ్డ కొద్దిమంది పర్యాటకులు, శ్యాం పిస్టన్స్‌ ఉద్యోగులు, లారీ డ్రైవర్‌కు లావేరు, రణస్థలం నుంచి వచ్చిన 108 వాహనాల్లో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అరబిందో పరిశ్రమ, ప్రభుత్వ అగ్నిమాపక కేంద్రాల నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపుచేశాయి. 

హిందీలో ఆర్తనాదాలు
ప్రమాదం జరిగిన వెంటనే హిందీలో ఆర్తనాదాలు వినిపించాయి. బస్సు యాక్సిడెంట్‌ యువా.. బస్సు జల్‌ గయ్‌... తూరంత్‌ బహార్‌ ఉతరో... ఉతరో (బస్సుకు ప్రమాదం జరిగింది. వెంటనే బయటకు దిగిపోండి) అంటూ హాహాకారాలతో ఉత్తరాఖండ్‌వాసులు బస్సు దిగిపోయారు. కొద్దికొద్దిగా మంటలు వ్యాపిస్తుండగా బస్సులో ఉన్న 45 మంది ఎమర్జన్సీ గేటు, ప్రధాన గేటు నుంచి బట్టలు, బ్యాగులు వదిలేసి హడావుడిగా దిగిపోయారు. వెంటనే స్పందించిన అధికారులు, పోలీసులు, స్థానికులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ యంత్రాంగం ఒక బస్సు ఏర్పాటు చేసి టూరిస్టులను విశాఖ పంపించింది. అక్కడి నుంచి వారు రైలు తదితర రవాణా సాధనాల ద్వారా స్వస్థలానికి వెళతారు. నెల రోజులపాటు కాశీ, పూరి, రామేశ్వరం, కన్యాకుమారి వంటి తీర్థయాత్రలు చేసేందుకు ఉత్తరాఖండ్‌ నుంచి టూరిస్టులు రెండు బస్సుల్లో బయలుదేరారు. అందులో ఒక బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. ప్రాణాలతో బయటపడినప్పటికీ డబ్బులు, ఏటీఎం కార్డులతో సహా సామాను దగ్ధం కావడంతో టూరిస్టులు కట్టుబట్టలతో మిగిలారు.

అధికారులు, స్థానికుల చొరవకు ప్రశంసలు
సంఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారులు సీఐ మల్లేశ్వరరావు, ఎస్సై అశోక్‌బాబు, ఫైర్‌ అధికారులు, ఆర్డీవో ఎం.వి.రమణ, తహసిల్దార్‌ ఎం.సుధారాణి స్పందించారు. స్థానిక మాజీ సర్పంచ్‌ లంకలపల్లి ప్రసాద్, గ్రామ పెద్దలు, అరబిందో యాజమాన్యం ఆధ్వర్యంలో స్థానికులు టూరిస్టులకు సపర్యలు చేశారు. సకాలంలో స్పందించి భోజనాలు, తాగునీరు, టూరిస్టులు విశాఖపట్నం వరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.  

సమస్తం బూడిదైంది...
నెల రోజులపాటు దైవ క్షేత్రాలు తిరిగేందుకు సుఖియాంచల్‌ ట్రావెల్స్‌ తో మాట్లాడుకున్నాం. పూరి చూసుకొని వస్తున్నాం. ప్రస్తుతం రామే శ్వరం వెళుతున్నాం. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. దుస్తులు, నగదు, ఆధార్, పాన్‌కార్డులు, ఏటీఎం కార్డులు సమస్త కాలిపోయాయి. తిరిగి వెళ్లేందుకైనా డబ్బులు లేవు.  – రావత్‌ బహుగుణ్, టూరిస్టు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top