ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్‌

Three Maoist Couriers Arrested In Khammam - Sakshi

సాక్షి, పాల్వంచ: పేలుడు పదార్థాలతో, ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తున్న కరపత్రాలతో వెళుతున్న ముగ్గురు మావోయిస్టు పార్టీ  కొరియర్లను పోలీసులు అరెస్ట్‌ చేసి, కోర్టుకు అప్పగించారు. స్థానిక పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించిన వివరాలు... పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సీఐ మడత రమేష్, ఎస్‌ఐ వెంకటప్పయ్య ఆధ్వర్యంలో ఈ నెల 8న పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో టేకులచెరువు గ్రామంలో మారుతి లింగయ్య ఇంటి వద్దకు వెళ్లారు. పోలీసులను చూడగానే పారిపోయేందుకు మారుతి లింగయ్య, అశ్వాపురం మండలం మామిళ్ళవాయి గ్రామానికి చెందిన మడలి ఇరమయ్య, బూర్గంపాడు రాజీవ్‌నగర్‌కు చెందిన మద్వి యెడమయ్య ప్రయత్నించారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పేలుడు పదార్ధాలు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లను స్వాధీనపర్చుకున్నారు.

మావోయిస్ట్‌ పార్టీలో లింగయ్య చురుగ్గా పనిచేస్తున్నాడు. మావోయిస్టు పార్టీ తూర్పు గోదావరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శి ఆజాద్‌కు కొంతకాలంగా కొరియర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఖమ్మం, మహబుబాబాద్‌ నుంచి పేలుడు పదార్థాలను సేకరించి ఆజాద్‌కు చేరవేశాడు. 2018 మార్చిలో ఆజాద్‌ ఆదేశాలతో విజయవాడలో వాకీటాకీలు, సెల్‌ ఫోన్లు, పవర్‌ బ్యాంక్, యూనిఫామ్, బూట్లు, సిమ్‌ కార్డ్‌లు, పేలుడు పదార్థాలు సేకరించి ఇచ్చాడు. ఆజాద్‌కు ఇతడు నమ్మిన బంటు. ఆజాద్‌ ఆదేశాలతో గత నెల 25న అశ్వాపురం, పాల్వంచ, బూర్గంపాడు, ములకలపల్లి మండలాల్లో (ఎన్నకలు బహిష్కరించాలని రాసి ఉన్న) పోస్టర్లు వేశాడు. పేలుడు పదార్థాలు అక్రమంగా సేకరించి, మావోయిస్టులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచాడు. ఇంతలోనే పోలీసులకు దొరికిపోయాడు.  

క్వారీల నుంచి పేలుడు పదార్ధాల సేకరణ 
క్వారీల్లో బ్లాసింగ్‌కు ఉపయోగించే పేలుడు పదార్థాలను వీరు కొంత కాలంగా సేకరిస్తున్నారని ఓఎస్డీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. క్వారీల్లోని సిబ్బందితో వీరు సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారి నుంచి పేలుడు పదార్థాలను రోజుకు కొంత చొప్పున పక్కదోవ పట్టించి, మావోయిస్ట్‌ కొరియర్లకు అమ్ముతున్నారని చెప్పారు. 
సమావేశంలో పాల్వంచ డీఎస్పీ మధుసూధన్‌ రావు, సీఐ మడత రమేష్, బూర్గంపాడు ఎస్‌ఐ వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top