అడ్లూర్‌లో దొంగల హల్‌చల్‌ 

Thieves Target Locked Houses In Adloor, Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి : కామారెడ్డి మండలం అడ్లూర్‌లో దొంగలు హల్‌చల్‌ చేశారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్‌ చేస్తూ ఒకే రాత్రి ఏకంగా 10 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారం అపహరించారు. గ్రామంలో దొంగలు పడ్డారనే విషయం తెలుసుకుని ఈ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ శ్వేత, డివిజన్‌ పోలీసులు పరిశీలించి, విచారణ జరిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడిన దొంగలు తాళం వేసిన ఇండ్లను ఎంచుకుని చోరీలకు పాల్పడ్డారు.

గ్రామానికి చెందిన బెల్గాం లక్ష్మణ్‌ ఇంట్లో రూ.లక్ష నగదు, బంగారు వెండి ఆభరణాలు, కమ్మరి భార్గవ్‌ ఇంట్లో రూ.50 వేల నగదు, బంగారు ఆభరణాలు, కమ్మరి బాల్‌రాజ్‌ ఇంట్లో రూ.20వేల నగదు, బంగారం వస్తువులు, దూదేకుల నూర్జాహాన్‌ ఇంట్లో రూ.20 వేలు, 12 తులాల వెండి, కాముని శంకర్‌ ఇంట్లో రూ.20 వేలు, బంగారం ఆభరణాలు, రాఘవపురం ప్రవీణ్‌కుమార్‌ ఇంట్లో రూ.5 వేల నగదు, వెండి బంగారం వస్తువులు, గాండ్ల గంగాధర్‌ ఇంట్లో రూ.7వేల నగదు, చింతల లక్ష్మి ఇంట్లో రూ.6వేల నగదు, బంగారం వస్తువులు దొంగిలించడంతో పాటు మరో రెండు ఇండ్లల్లోకి తాళం పగులగొట్టి చొరబడ్డారు. మొత్తం ఎనిమిది ఇళ్లలో నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరికి గురికాగా రెండు ఇండ్లలో ఎలాంటి నష్టం జరుగలేదు.

సోమవారం ఉదయాన్నే స్థానికులు పలు ఇండ్లలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. చోరీ జరిగిన ఇళ్లను పోలీసులు పరిశీలించారు.  ఎస్పీ శ్వేతతో పాటు కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ప్రొబెషనరీ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి, సీఐ భిక్షపతి, దేవునిపల్లి ఎస్సై, శ్రీకాంత్, గ్రామాన్ని సందర్శించారు. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలను రప్పించి ఆధారాలను సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top