స్ట్రాంగ్‌ రూమ్‌లో దూరి.. రూ.1.35 కోట్లు చోరి

Thieves Stolen 1.35 Crore Rupees From Sbi Amreli Strong Room - Sakshi

రాజ్‌కోట్‌: చిన్న సందు దొరికితే చాలు దొంగలు దూరిపోతున్నారు. తాజాగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)కు చెందిన ఓ బ్రాంచ్‌లో చోరబడిన దుండగులు ఏకంగా కోటి 35 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్‌లో జరిగింది. శనివారం రాత్రి దొంగలు తొలుత  బ్యాంక్‌ పక్కనే ఖాళీగా ఉన్న భవనంలోకి చేరుకున్నారు. ఆ తర్వాత బ్యాంక్‌ స్ట్రాంగ్‌ రూమ్‌కు ఉన్న వెంటిలేటర్‌ ఇనుప గ్రిల్స్‌ను తొలగించారు. ఆ చిన్న సందులో నుంచి ఓ వ్యక్తి బ్యాంక్‌ స్ట్రాంగ్‌ రూమ్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నగదుతో అదే వెంటిలేటర్‌ నుంచి ఉడాయించారు. కాగా శనివారమే చోరి జరిగినప్పటికీ ఆదివారం, సోమవారం(కృష్ణాష్టమి) రెండు రోజులు బ్యాంక్‌కు సెలవు కావడంతో..  మంగళవారం బ్యాంక్‌ తెరవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజు సాయంత్రం బ్యాంక్‌ అధికారులు అమ్రేలి పోలీసులను ఆశ్రయించారు. ఎంత నగదు చోరికి గురైందో తెలుసుకోవడానికి అధికారులు రికార్డులను పరిశీలించారు. 1.35 కోట్ల రూపాయలకు పైగా దొంగిలించబడినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బ్యాంక్‌ సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నామని తెలిపారు. దొంగలు వెనుక వైపు నుంచి రావడంతో వారు స్ట్రాంగ్‌ రూమ్‌ డోర్లను తాకలేదని.. అందువల్ల అలారమ్‌ మోగలేదన్నారు. దొంగలు ప్రవేశించిన పాత బిల్డింగ్‌ను గతంలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ వారు వినియోగించుకున్నారని.. ప్రస్తుతం అది ఖాళీగా ఉందని పేర్కొన్నారు. ఈ చోరిలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై స్పష్టత లేదాన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top