
చిలమత్తూరు: సోమఘట్ట గ్రామ సమీపంలోని మధుగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. హుండీలు పగలగొట్టి అందులోని నగదుతో పాటు అర్చకుని భార్యకు చెందిన నగలు, సెల్‌ఫోన్లను లాక్కెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు ప్రవేశిం్చచారు. అక్కడే శనివారం పూజల కోసం నిద్ర చేస్తున్న అర్చకులు పద్మనాభచారి, లక్ష్మీదేవమ్మ దంపతులను బెదిరించారు. అర్చకులు పద్మనాభచారి చేతులు, కాళ్లు కట్టేసి ఆలయంలోకి చొరబడి గునపం, తదితర రాడ్‌ల సాయంతో హుండీ పగలగొట్టారు.
పక్కనే ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలోని హుండీని కూడా పగల గొట్టి అందులోని సొమ్మును అపహరించారు. అర్చకుడి భార్య లక్ష్మీదేవమ్మకు చెందిన రూ.85 వేల విలువ చేసే బంగారు నగలతో పాటు రెండు సెల్‌ఫోన్లు దోచుకుని ఉడాయించారు. సమాచారం అందుకున్న పెనుకొండ పెనుకొండ డీఎస్పీ ఐ.రామకృష్ణ, సీఐ వెంకటేశులు, ఎస్‌ఐ ప్రదీప్ కుమార్, పోలీసుల, క్లూస్ టీంతో శనివారం ఉదయం ఆలయంలో అణువణువూ సోదా చేశారు. ఆలయ పరిసరాలను పరిశీలించి స్థానికులతో ఆరా తీశారు.