breaking news
devastation thieves
-
దోపిడీ దొంగల బీభత్సం
చిలమత్తూరు: సోమఘట్ట గ్రామ సమీపంలోని మధుగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. హుండీలు పగలగొట్టి అందులోని నగదుతో పాటు అర్చకుని భార్యకు చెందిన నగలు, సెల్ఫోన్లను లాక్కెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు ప్రవేశిం్చచారు. అక్కడే శనివారం పూజల కోసం నిద్ర చేస్తున్న అర్చకులు పద్మనాభచారి, లక్ష్మీదేవమ్మ దంపతులను బెదిరించారు. అర్చకులు పద్మనాభచారి చేతులు, కాళ్లు కట్టేసి ఆలయంలోకి చొరబడి గునపం, తదితర రాడ్ల సాయంతో హుండీ పగలగొట్టారు. పక్కనే ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలోని హుండీని కూడా పగల గొట్టి అందులోని సొమ్మును అపహరించారు. అర్చకుడి భార్య లక్ష్మీదేవమ్మకు చెందిన రూ.85 వేల విలువ చేసే బంగారు నగలతో పాటు రెండు సెల్ఫోన్లు దోచుకుని ఉడాయించారు. సమాచారం అందుకున్న పెనుకొండ పెనుకొండ డీఎస్పీ ఐ.రామకృష్ణ, సీఐ వెంకటేశులు, ఎస్ఐ ప్రదీప్ కుమార్, పోలీసుల, క్లూస్ టీంతో శనివారం ఉదయం ఆలయంలో అణువణువూ సోదా చేశారు. ఆలయ పరిసరాలను పరిశీలించి స్థానికులతో ఆరా తీశారు. -
పెద్దతూప్రలో దొంగల బీభత్సం
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దుండగులు మండల పరిధిలోని పెద్దతూప్రలో బీభత్సం సృష్టించారు. బంగారు, వెండి ఆభరణాలు, నగదును అపహరించుకుపోయారు. రాఖీలు కట్టేందుకు ఇళ్లకు తాళం వేసి పలువురు కుటుంబ సమేతంగా వెళ్లడంతో దుండగులు తెగబడ్డారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. గ్రామంలోని దిద్యాల సురేష్, మంజుల దంపతులు ఈ నెల 21న ఇంటికి తాళం వేసి రాఖీ పండుగకు ఊరికి వెళ్లారు. సురేష్ అన్నదమ్ములకు చెందిన నాలుగు ఇళ్లు వరసగా ఉన్నాయి. గురువారం రాత్రి దుండగులు సురేష్ సోదరుల ఇళ్లకు గడియలు వేసి ఆయన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువాను తెరిస్తే శబ్దం వస్తుందని దాన్ని గ్రామ శివారులోకి తీసుకెళ్లి అందులో ఉన్న 5 తులాల బంగారు నెక్లెస్, చెవి కమ్మలు, రూ. 40 వేల నగదును అపహరించారు. మరో ఆరు ఇళ్లల్లో.. గ్రామంలోని మరో ఆరు ఇళ్లల్లో ఇదే తరహాలో దొంగలు తెగబడ్డారు. గ్రామానికి చెందిన నల్లొల్ల బుచ్చయ్య నగరంలో ఉంటుండగా తల్లి రాములమ్మ స్థానికంగా అతని గదిలో ఉంటోంది. గురువారం రాత్రి రాములమ్మ మరో కొడుకు రాజయ్య ఇంట్లో నిద్రించింది. రాములమ్మ గది తాళం విరగొట్టి సామగ్రిని చిందరవందర చేశారు. డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలో ఉన్న రూ.3 వేలను ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న రాములమ్మ మరో కొడుకు చంద్రయ్య అర్ధరాత్రి సమయంలో చోరీ విషయం గుర్తించి స్థానికుల సాయంతో దొంగల కోసం వెతికినా ఫలితం లేకుండాపోయింది. రాములమ్మ ఇంటితో పాటు దుండగులు మరో 5 ఇళ్లలో చోరీ చేశారు. మైల అశోక్, లలిత దంపతులు బంధువుల ఇంటికి వెళ్లగా దుండగులు బీరువా ధ్వంసం చేసి రూ.25 వేలు చోరీ చేశారు. బ్యాగరి కృష్ణ ఇంటి తాళం విరగ్గొట్టి బీరువాలో ఉన్న 20 తులాల వెండి ఆభరణాలు, రూ.3500 నగదు అపహరించారు. రెండు చోట్ల ఒకే తరహాలో.. ఈ నెల 13న ఘాంసిమియాగూడలో, తాజాగా పెద్దతూప్రలో జరిగిన దొంగతనాలు ఒకే తరహాలో ఉన్నాయి. దొంగలు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా శుక్రవారం పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. గురువారం మధ్యాహ్నం.. పెద్దతూప్రకు చెందిన కావలి రమేష్, సునీత దంపతులు ఈనెల 22న ఇంటికి తాళం వేసి కూలికి వెళ్లారు. మధ్యాహ్నం దుండగులు ఇంట్లోకి చొరబడి రూ.18 వేల నగదు, 35 తులాల వెండి, పావు తులం బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గురువారం రాత్రి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.