టీడీపీ నేత విజయకుమార్‌ అరెస్టు | TDP Leader Kapalawai Vijay Kumar Arrest | Sakshi
Sakshi News home page

నరసరావుపేటలో కలకలం

Oct 13 2018 8:38 AM | Updated on Oct 13 2018 8:57 AM

TDP Leader Kapalawai Vijay Kumar Arrest - Sakshi

నరసరావుపేటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నేత కపలవాయి విజయకుమార్‌ను నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సాక్షి, నరసరావుపేట టౌన్‌: సంచలనం సృష్టించిన కిడ్నీరాకెట్‌ కేసులో నరసరావుపేటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నేత కపలవాయి విజయకుమార్‌ను నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు చంద్రమౌళీనగర్‌కు చెందిన చిగురుపాటి నాగేశ్వరరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 2017లో గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరాడు. కిడ్నీ మార్పిడికి దాతను చూసుకోవాలని వైద్యులు సూచించడంతో దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన ముఢావత్‌ వెంకటేశ్వర్లు నాయక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

నరసరావుపేటకి చెందిన రావూరి రవి అనే వ్యక్తి ఆధార్‌కార్డుపై వెంకటేశ్వర్లు నాయక్‌ ఫొటోను మార్ఫింగ్‌ చేసి గతేడాది అక్టోబరు నెలలో నరసరావుపేట రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు పొందారు. పోలీసుల అనుమతి కోసం వెళ్లగా బార్‌కోడింగ్‌ ఆధారంగా నకిలీ ఆధార్‌కార్డుగా గుర్తించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అప్పటి తహసీల్దార్‌ సీహెచ్‌ విజయజ్యోతికుమారి 2017 నవంబరు 20వ తేదీన వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు. అనంతరం కిడ్నీ మార్పిడి అనుమతులకు కపలవాయి విజయకుమార్‌ సిఫారసు చేశాడని తహసీల్దార్‌ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వటంతో విజయకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు విచారణలో ముడావత్‌ వెంకటేశ్వర్లునాయక్‌ తనను బెదిరించి కిడ్నీ మార్పిడికి ఒప్పించారని తెలపడంతో కేసును అట్రాసిటీ కేసుగా మార్పు చేశారు.

ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తొమ్మిదో నిందితుడయిన విజయకుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి రిమాండ్‌ విధించడంతో సబ్‌జైలుకు తరలించారు. ఆరోగ్యపరిస్థితి బాగోలేదని జైలు అధికారులకు తెలపడంతో వైద్య పరీక్షలకోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. బంగారం, వెండి వర్తకసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కపలవాయి విజయకుమార్‌ నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నేతగా చలామణి అవుతున్నారు. ఆయన అరెస్టును నిరసిస్తూ పట్టణంలోని బంగారం వ్యాపారులంతా దుకాణాలను మూసివేసి సంఘీభావం తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement