ఏం జరిగిందో..!

Suspects In Narayana college student Charan Reddy Death - Sakshi

కూర్చొని ఉరి వేసుకోవడం సాధ్యమేనా?

చరణ్‌రెడ్డి మృతిపై అన్నీ అనుమానాలే

పోలీసుల బందోబస్తుతో హడావుడి

యాజమాన్య నిర్లక్ష్యం, దండింపులే కారణమా?

ఆత్మహత్యా...అనుమానాస్పదమా!

విద్యార్థి కుటుంబానికి తీరని వేదన

సరిగా ఆలోచించే వయసు కూడా లేని పసిమొగ్గలు బలవన్మరణాలకు పాల్పడేంత సాహసం చేస్తారా... లేక ఏదైనా కారణాలతో వారిని చిదిమేస్తున్నారా..కారణాలేమైనా ఒక విద్యాజ్యోతి ఆరిపోయింది. దీపం వెలిగించండని తల్లిదండ్రులు పడుతున్న వేదన అరణ్యరోదనగా మారింది. ఒక్క చరణ్‌రెడ్డే కాదు..గతంలో జిల్లాలోని నారాయణ కళాశాలలో ఇద్దరు, ఈ ఏడాది సెప్టెంబరులో మరొకరు ఇలా మైనర్ల శ్వాస గాలిలో కలిసిపోయింది. వీటికి అంతం లేదా? అందరిలోనూ మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరగకపోవడం కుదిపేస్తోంది. బాధితుల కుటుంబాలను కుంగదీస్తోంది.

సాక్షి, కడప/అర్బన్‌: కడప నగర శివార్లలోని మౌంట్‌ఫోర్ట్‌ ఇంగ్లిషు మీడియం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల చరణ్‌రెడ్డి మరణం అనుమానాలకు తావిచ్చింది. ఆత్మహత్య అంటూ యాజమాన్యం అంటున్నా పరిస్థితులు చూస్తే భిన్నంగా కనిపిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. చిన్నారి ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితులు ఏమున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల మూడోఅంతస్తు వద్ద ఉరి వేసుకున్న తీరు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. ప్రత్యేకంగా టై ఎక్కువ పొడవు కూడా ఉండదు. ఒకవేళ ఉరి వేసుకోవడానికి మెడకు చుట్టుకుంటే కడ్డీలకు ముడివేయాలన్నా సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు.  నిలబడి కాకుండా  కూర్చొని ఆత్మహత్యలో భాగంగా ఉరి వేసుకున్నట్లు అక్కడి వారు చెబుతుండడం చూస్తే చిత్రంగా ఉంది. నిలబడి కాళ్లు కింద తగలకుండా ఉరి వేసుకున్న సంఘటనలు చూసి ఉంటారు. కానీ కూర్చొని ఉరి వేసుకున్నట్లు చెబుతున్న దానిపై పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసును నమోదు చేశారు. ఏదిఏమైనా వ్యవహారమంతా అనుమానాల పరంగానే సాగుతోంది.

వరుస ఘటనలు
 వైఎస్సార్‌జిల్లాలో వరుసగా ఘటనలు జరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. కృష్ణాపురం సమీపంలోని నారాయణ కళాశాలలో 2015లో మనీషా, నందినిలో ఒకే గదిలో ఫ్యాన్లకు చున్నీలతో ఉరి వేసుకున్న ఘటన మరువకమునుపే 2017 సెప్టెంబరులో పావని అనుమానాస్పదంగా అదే క్యాంపస్‌లో మృతి చెందారు. అంతలోనే మళ్లీ మంగళవారం మౌంట్‌ఫోర్ట్‌ పాఠశాల ఆవరణంలో విద్యార్థి చరణ్‌రెడ్డి చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇలా వరుస ఘటనలను పరిశీలిస్తే అసలు ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదు. యాజమాన్యాల నిర్లక్ష్యమా...లేక వేధింపులా....లేక ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తున్నారా? అన్నది బయటికి రావడం లేదు.

విద్యార్థి దశలోనే....
చలాకీగా చదువుకుంటూ ఉత్తేజంగా, ఉల్లాసంగా వాలీబాల్‌ ఆడుకుంటూ విద్యను అభ్యసిస్తున్న చరణ్‌రెడ్డికి  విద్యార్థి దశలోనే నిండు నూరేళ్లు నిండినట్లయింది. జిల్లాలోని బద్వేలు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన జోసెఫ్‌ కొండారెడ్డి, సుష్మల రెండవ కుమారుడైన కంభం చరణ్‌రెడ్డి (14) కడప నగర శివార్లలోని మౌంట్‌ఫోర్ట్‌ ఇంగ్లిషు మీడియం హైస్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే చింతకొమ్మదిన్నె మండలం విశ్వనాథపురంలో ఉన్న అమ్మమ్మ నిర్మలమ్మ ఇంటికి గత శనివారం వెళ్లి తిరిగి సోమవారం ఉదయం వచ్చాడని, అయితే అనుమతి లేకుండా మరలా బయటికి వెళ్లి మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పాఠశాలకు వచ్చాడు. ఈ నేపథ్యంలో హాస్టల్‌ వార్డెన్, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థుల సమక్షంలో చరణ్‌రెడ్డిని మందలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీసీ పుటేజీలో కొంతమాత్రమే రికార్డు
చరణ్‌ అందరు విద్యార్థుల్లాగే రాత్రి వేళ భోజనం ముగిసిన తర్వాత స్టడీ అవర్‌కు హాజరయ్యాడు. అనంతరం సహచర విద్యార్థులతోపాటు నిద్రించాడు. తరువాత  మూడవ అంతస్తులోని మెట్ల క్యారిడార్‌లో తన టైతోనే ఉరేసుకుని అలాగే కూర్చొని ఉన్నట్లు చూసిన విద్యార్థులు యాజమాన్యానికి తెలిపారు. అయితే చరణ్‌ అర్దరాత్రి ఒంటి గంట 3 నిమిషాల ప్రాంతంలో టై తీసుకుని వెళుతున్న దృశ్యాలు మాత్రం రికార్డు అయ్యాయని పోలీసులు మీడియాకు తెలియజేశారు. తర్వాత ఏం జరిగిందన్నది  కెమెరాలో లేకపోవడంతో వ్యవహారం బయట పడలేదు. సంఘటన ప్రాంతంలో సహచర విద్యార్థులు చరణ్‌నుచూసి వార్డెన్‌కు సమాచారం ఇచ్చే వరకు  పైన ఏం జరిగిందో తెలియని పరిస్థితి.

మెడ ఎడమవైపు కుమిలిన గాయం
చరణ్‌రెడ్డి టైతోనే తనంతకు తానుగా ఉరి వేసుకుని మరణించాడా? లేక వేరే ఎవరైనా వచ్చి ఈ చర్యలకు పాల్పడ్డారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మృతదేహం పరిశీలిస్తే మెడ ఎడమవైపు కమలిన గాయం ఉంది. కానీ నాలుక బయటికి ఉన్నట్లుగా కనిపించడం లేదు. పోలీసులు కూడా   జోసెఫ్‌ కొండారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో చరణ్‌రెడ్డి మృతి చెందాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ చర్యకు పాల్పడ్డాడా? లేదంటే ఎవరైనా అతన్ని హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనేది విచారణలో తెలియాల్సి ఉంది.

జన్మదిన వేడుకలు జరుపుకుని పది రోజులు కాకముందే
తన కుమారుడు చరణ్‌రెడ్డి ఈనెల 3వ తేదీన జన్మదిన వేడుకలు జరుపుకున్నాడని, ఆ సమయంలో రూ. 3 వేలు విలువైన డ్రస్‌ను కూడా కొనిచ్చానని, ఎంతో ఆనందంగా గడిపాడని తండ్రి జోసెఫ్‌ కొండారెడ్డి ఆవేదనతో మీడియాకు తెలిపారు. ఔటింగ్‌ పంపేటపుడు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలనే కనీస బాధ్యతను కూడా పాటించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహారించారని కొండారెడ్డి ఆరోపించారు. తమ కుమారుడు ఎలా మృతి చెందాడనే విషయం స్పష్టంగా తెలియడం లేదని, పోలీసులు దర్యాప్తు చేసి బాధ్యులైన వారిని శిక్షించాలని కొండారెడ్డి తెలియజేశారు.

నా తప్పులేదు : ప్రిన్సిపల్‌
మౌంట్‌ఫోర్ట్‌ పాఠశాలలో చరణ్‌రెడ్డి మృతికి సంబంధించి తన తప్పు ఎంతమాత్రం లేదని.... పిల్లలను రాత్రంతా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వార్డెన్‌దేనని ప్రిన్సిపల్‌ జోసెఫ్‌ తెలిపారు. అందుకు సంబంధించి కడప డీఎస్పీ కార్యాలయం వద్ద మీడియాకు వివరణ  ఇచ్చారు. చరణ్‌తో పాటు అందరు విద్యార్థులు  వార్డెన్‌ పర్యవేక్షణలోనే ఉంటారన్నారు.. గతంలో జరిగిన సంఘటనల గురించి వివరణ కోరగా తనకు సంబంధించినత వరకు ఎలాంటి తప్పిదం లేదని వెల్లడించారు.

బందోబస్తుతో పోలీసుల హడావుడి
చరణ్‌రెడ్డి మృతి సంఘటన తెలియగానే వివిధ ప్రదేశాల్లో కడప డీఎస్పీ షేక్‌ మాసుంబాష ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వర్తించారు. మౌంట్‌ఫోర్ట్‌ స్కూలు,  రిమ్స్‌ మార్చురీ, విద్యార్థి ఇంటి వద్ద పోలీసులు, స్పెషల్‌ పార్టీ పోలీసులు బందోబస్తు భారీగా ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా హడావుడి చేశారు. ఈ బందోబస్తు విధుల్లో సీఐలు టీవీ సత్యనారాయణ, భాస్కర్‌రెడ్డి, పురుషోత్తంరాజు, హేమసుందర్‌రావు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో పాఠశాల, కళాశాల స్థాయిల్లో వరుస సంఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం మేల్కొని తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన మానసిక ఒత్తిల్ల వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top