
జియాగూడ: మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని రాణిగంజ్–2 డిపోకు చెందిన కండక్టర్ సురేందర్ గౌడ్ (45)ఆదివారం రాత్రి కార్వాన్‌లోని బాంజవాడి తోటలోని తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో ప్లాస్టిక్ వైర్ తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గంట తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. 14 ఏళ్లుగా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న సురేందర్.. ఇటీవల ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఉద్యోగం పోతుందేమోనన్న ఆందోళనతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సురేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.