డాన్‌ కావాలనే హత్య? | Student Murder Case Reveals In Kurnool | Sakshi
Sakshi News home page

డాన్‌ కావాలనే హత్య?

Sep 12 2018 2:02 PM | Updated on Nov 9 2018 4:36 PM

Student Murder Case Reveals In Kurnool - Sakshi

ఎముకలను మృతుడి తండ్రికి చూపిస్తున్న సీఐ సుబ్బరాయుడు మృతదేహం కోసం తవ్వుతున్న దృశ్యం

కర్నూలు, పాణ్యం:  డాన్‌ కావాలనుకున్న ఓ విద్యార్థి తోటి స్నేహితుడినే మట్టుబెట్టాడు! అది కూడా సినిమా దృశ్యాలను తలపించే రీతిలో అతి కిరాతకంగా హత్య చేశాడు! ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించకపోయినప్పటికీ ఇదే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  నంద్యాల పట్టణానికి చెందిన ఖలీల్, సమీర కుమారుడు సద్దాంహుసేన్‌. ఇతను స్థానికంగా  ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఈ ఏడాది జూలై 17న అదృశ్యమయ్యాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు నంద్యాల టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. సద్దాం హుస్సేన్‌ను తోటి స్నేహితులే చంపి, పెట్రోల్‌ పోసి మృతదేహాన్ని తగులబెట్టిన అనంతరం అస్థికలను పాణ్యం మండలం పిన్నాపురం గ్రామం వద్ద పూడ్చిపెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో మంగళవారం నంద్యాల టూటౌన్‌ సీఐ సుబ్బరాయుడు, పాణ్యం సీఐ వాసుక్రిష్ణ, పోలీస్‌ కంట్రోల్‌ సీఐ విజయభాస్కరరెడ్డి, ఎస్‌ఐలు జగదీశ్వరరెడ్డి, కృష్ణుడు, ఆర్‌ఐ శ్రీనివాసులు, ఈఓ సుదర్శన్‌రావు, వైద్యులు గంగధర్‌నాయక్‌తో పాటు రెవెన్యూ, పంచాయతీ అధికారుల సమక్షంలో సద్దాం అస్థికలు వెలికి తీయించారు.

హత్య జరిగిన ప్రాంతంలో పడివున్న చెప్పులు, చొక్కా, రింగ్‌ను మృతుడి తండ్రి ఖలీల్, బంధువులు గుర్తించి శోకసంద్రంలో మునిగిపోయారు. అస్థికలను డీఎన్‌ఏ పరీక్షకు పంపనున్నామని, ఆ తర్వాత వచ్చే నివేదిక ఆధారంగా వివరాలు వెల్లడిస్తామని సీఐ సుబ్బరాయుడు తెలిపారు.  ఇదిలావుండగా.. సద్దాం స్నేహితుల్లో ఒకడైన కేరళకు చెందిన విద్యార్థి డాన్‌ కావాలనే ఉద్దేశంతో అతన్ని మట్టుబెట్టినట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. అతను అనంతపురం జిల్లా తాడిపత్రిలో నివాసముంటూ చదువుకునేందుకు నంద్యాల వచ్చాడని, డాన్‌ కావాలనే ఉద్దేశంతో పక్కా ప్లాన్‌ వేసి సద్దాంను అతి కిరాతంగా హత్య చేశాడని పోలీసు అదుపులో ఉన్న నిందితుల్లో ఒకరు చెప్పినట్లు సమాచారం. చెట్టుకు కట్టేసి, తలపై ఇనుప రాడ్‌తో మోది, ఆపై కత్తితో పొడిచి సినిమా దృశ్యాలను తలపించే రీతితో హతమార్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. కాగా.. సద్దాం తండ్రి ఖలీల్‌ మాత్రం మరో కథనం చెబుతున్నాడు. తన కుమారుడికి రూ.4 వేల స్కాలర్‌షిప్‌ వచ్చిందని, తమకు తెలియకుండా స్నేహితులకు ఇచ్చాడని, తిరిగివ్వాలని వారిని పలుమార్లు కోరినా పట్టించుకోలేదని తెలిపాడు. ఈ క్రమంలోనే గత నెల 17న స్నేహితుల్లో ఒకడైన వెంకటేశ్వర్లు ఇంటి వద్దకు వచ్చి తమ కుమారుడిని తీసుకెళ్లాడని, ఇంతటి ఘోరానికి పాల్పడతారని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటన విషయంలో అమ్మాయి కోణంపైనా చర్చ సాగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement