చిన్నారిని చంపేసిన కుక్కలు

Street Dogs Killed Baby Boy in Karnataka - Sakshi

బెంగళూరు సోలదేవనహళ్లిలో ఘోరం  

వలస కార్మిక దంపతులకు కడుపుకోత  

కర్ణాటక, బొమ్మనహళ్లి : రాజదాని బెంగళూరులో ఎప్పుడు వీధి కుక్కలు విరుచుకుపడతాయో, ఎప్పుడు ప్రాణాలు తీస్తాయో చెప్పడం కష్టం. బెంగళూరు పాలికె నిర్లక్ష్యం వల్ల వీధి శునకాలు విచ్చలవిడిగా సంచరిస్తూ జనాన్ని కరుస్తున్నాయి. గతంలో ఎన్నో సార్లు వీధికుక్కలు దాడి చిన్నారులను గాయపరిచిన సంఘటనలు మరిచిపోక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో చిన్నారి బాలుడు తన ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన నగరంలో చోటు చేసుకుంది. 

బిస్కెట్‌ కొందామని అంగడికి వెళ్లగా  
బాధిత బాలుడు గుల్బర్గా జిల్లాలోని సేడం తాలూకాకు  చెందిన మల్లప్ప,అనిత దంపతుల కుమారుడు దుర్గేష్‌ (5)గా గుర్తించారు. పొట్టచేత పట్టుకొని జీవనం సాగించడానికి వచ్చిన ఈ దంపతులు బెంగళూరు  ఉత్తరలోని సోలదేవనహళ్ళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న అజ్జెగౌడన పాళ్యలో నివాసముంటున్నారు. దొరికిన కూలిపనులు చేసుకుంటూ జీవించేవారు.  సోమవారం సాయంత్రం అంగట్లో బిస్కెట్లు కొనుక్కోవడానికి వెళ్లిన బాలుడు దుర్గేష్‌పైన వీధికుక్కలు పడి కరిచాయి. తీవ్రగాయాలైన బాలుడు మృతి చెందడం జరిగింది. 

ప్రజల ఆగ్రహం  
ఈ ప్రాంతంలో చిన్నారుల పైన వీధి కుక్కలు దాడి చేయడం మూడోసారి అని ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయంపైన గ్రామానికి చెందిన అధికారులు కానీ, బీబీఎంపీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘోరాలు తరచూ చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు మండి పడుతున్నారు.

మరో ఘటనలో చిన్నారికి గాయాలు  
నగరంలోని ఎంజీ రోడ్డుకు సమీపంలో ఉన్న శాంతినగర నియోజకవర్గంలోని నీలసంద్ర వార్డులోని రోజ్‌గార్డెన్‌లో చిన్నారిపైన వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. చిన్నారి గట్టిగా అరువడంతో స్థానికులు గమనించి కుక్కలను పారదోలారు. దాంతో చిన్నారి పాప బతికి బయటపడింది. ఇప్పటికైనా నగరంలో వీధి కుక్కల బెడదను తగ్గించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top