ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో

still pending in techie missing case  - Sakshi

టెక్కీ అజితాబ్‌ కేసులో పురోగతి శూన్యం

గత డిసెంబర్‌ 18 నుంచి మిస్సింగ్‌

సిట్‌ వేసినా ఫలితం సున్నా

ఇంట్లో ఎవరైనా ఒక్కరోజు కనిపించకపోతేనే కుటుంబం, బంధుమిత్రులు కంగారు పడతారు. అలాంటిది వారం, రెండు వారాలు కాదు ఏకంగా రెండు నెలల నుంచి కన్నకొడుకు కనిపించక ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఏ ఫోన్‌ వచ్చినా తమ కొడుకుదేమోనని ఆశ మిణుకుమంటోంది. పోలీసుల చుట్టు తిరుగుతున్నా ఏం చెప్పలేకపోతున్నారు. రోదసిని అందుకునే టెక్నాలజీ ఉందని చెబుతారు, కానీ నగర శివార్లలో జరిగిన ఘటనను ఛేదించలేకపోతున్నారు.

సాక్షి, బెంగళూరు:  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అజితాబ్‌ కుమార్‌ సిన్హా అదృశ్యమై రెండు నెలలు ముగిసింది. అయినా ఇప్పటివరకు పోలీసులు అతని ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టిన తన కారును అమ్మేందుకు గత ఏడాది డిసెంబర్‌ 18న బయటకు వెళ్లిన అజితాబ్‌.. అప్పటినుంచి ఏమయ్యాడో తెలియదు. వైట్‌ఫీల్డ్‌లో స్నేహితునితో నివాసం ఉంటున్న అజితాబ్‌ ఒక ప్రముఖ ఐటీ కంపెనీలలో ఇంజినీరు. తన మారుతి సియాజ్‌ కారును ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. ఒక ఆగంతకుడు అజితాబ్‌ను ఫోన్‌ చేసి కారును కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. దీంతో డిసెంబర్‌ 18న కారును తీసుకుని అజితాబ్, కొనుగోలుదారుడిని కలిసేందుకు వెళ్లాడు. అయితే ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్‌. వైట్‌ఫీల్డ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు తీవ్రంగా గాలించారు. దీనికితోడు ఉన్నతాధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడిలో ఎంత వెతికినా అజితాబ్‌ ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో అజితాబ్‌ తండ్రి అశోక్‌సిన్హా హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ చేయించాలని కోరారు. ధర్మాసనం కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ద్వారా విచారణ జరిపించాలని నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. సిట్‌ కూడా ఏం సాధించలేకపోయింది.

ఆ సిమ్‌ కోలారులో కొన్నారు
పోలీసులు కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేసినా ఫలితం దక్కలేదు. కొన్ని వేల కాల్స్‌ను పరిశీలించినా క్లూ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. మిస్సయిన అజితాబ్‌ ఫోన్‌ను ఇప్పటివరకు తిరిగి ఆన్‌ చేయలేదు. కొనుగోలుదారుని నంబర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించగా అది కోలారు నగరానికి చెందిన బీడీ కార్మికురాలు సబీనాకు చెందినదని  గుర్తించారు. ఆమెను విచారిస్తే ఆ సిమ్‌ నిందితుని దగ్గరకు ఎలా వెళ్లిందో తనకు తెలియదని చెప్పింది. ఆ సిమ్‌ను వాడడం ఆపేసి అప్పటికే వారం రోజులు పైగా అయిందని తెలిపింది. కోలారు నగరంలోని ఆనంద్‌ అనే వ్యక్తి షాపులో నిందితుడు సిమ్‌ కార్డును కొనుగోలు చేసినట్లు తెలిసింది. సబీనా ఫోటో, పత్రాలతో ఆమె పేరు మీద గుర్తు తెలియని వ్యక్తికి సిమ్‌ తీసుకున్నాడు. ఆ షాపులోని సీసీటీవీ ఫుటేజీ కూడా దొరక్కపోవడం గమనార్హం. షాపు యజమాని ప్రతి 30 రోజులకొకసారి సీసీటీవీ దృశ్యాలను తొలగిస్తాడని తెలుసుకున్న నిందితుడు తెలివిగా సిమ్‌ కొన్న 30 రోజుల తర్వాత అజితాబ్‌తో వ్యవహారం నడిపాడు.

కారు కూడా ఆచూకీ లేదు
కిడ్నాప్‌ గురైన తర్వాత అజితాబ్‌ కుటుంబం, స్నేహితులకు ఏవైనా హెచ్చరిక ఫోన్లు కాల్స్‌ వచ్చాయేమోనని పోలీసులు విచారించారు. అయితే ఎలాంటి కాల్స్‌ రాలేదని నిర్ధారించుకున్నారు. అజితాబ్‌కు కూడా ఎవరితోనూ వ్యక్తిగత విభేధాలు లేవని గుర్తించారు. విచిత్రం ఏమిటంటే అజితాబ్‌ అదృశ్యమైనప్పటి నుంచి అతని కారు కూడా కనిపించలేదు. అన్ని టోల్‌ప్లాజా సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. కానీ ఎలాంటి ఫలితం లభించలేదు. తమిళనాడుకు వెళ్లే 15 మార్గాల్లో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవని, నిందితుడు ఆ మార్గాల్లో ఏదో ఒకదానిలో వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top