కరుడుగట్టిన నిందితుల బ్యారక్‌కు శ్రీనివాస్‌రెడ్డి

Special Surveillance with cc cameras on Srinivas Reddy - Sakshi

సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా

హాజీపూర్‌ నిందితునికి రోజూ సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌ 

నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్న వరంగల్‌ జైలు అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌ : యాదాద్రి జిల్లా హాజీపూర్‌లో ముగ్గురు మైనర్లను పొట్టనబెట్టుకున్న శ్రీనివాస్‌రెడ్డిని ఇప్పుడు కరుడుగట్టిన నిందితులకోసం కేటాయించిన బ్యారక్‌లోని ప్రత్యేక సెల్‌లో పటిష్ట బందోబస్తు మధ్య వరంగల్‌ జైల్లో ఉన్నాడు. అతని నేరచరిత్ర ఆధారంగా సాధారణ ఖైదీలతో కలవనీయకుండా ఈ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు వరంగల్‌ కారాగార సూపరింటెండెంట్‌ మురళి బాబు శుక్రవారం తెలిపారు. శ్రీనివాసరెడ్డిని జైలుకు తీసుకువచ్చినపుడు అతనితో జైలు అధికారులు మాట్లాడారు. అడ్మిషన్‌ రిజిస్టర్‌లో పేరు నమోదు చేసుకునేటపుడు అతని వివరాలు అడిగినపుడు అతని ప్రవర్తన సాధారణంగా లేదని, అలాగని అసాధారణంగానూ లేదని మధ్యస్థంగా ఉందని జైలు అధికారులు తెలిపారు.
 
ఇలాంటి మనస్తత్వంగల నేరస్తులు ఎప్పుడు ఏం చేస్తారో? ఎలా ప్రవర్తిస్తారో? చెప్పడం కష్టమనీ, ఇలాంటివారు ఇతరులపై లేదా జైలు సిబ్బందిపై దాడులు కూడా చేయవచ్చునని అందుకే, అతన్ని సాధారణ ఖైదీలతో కలవనీయకుండా ప్రత్యేక సెల్‌ కేటాయించామని అధికారులు వివరించారు. అతని ప్రవర్తనను గమనించేందుకు సెల్‌లో సీసీ టీవీ కెమెరాలనూ ఉంచామన్నారు. మామూలు ఖైదీలకైతే 200 నుంచి 300 మంది ఖైదీలకు కాపలాగా ఒక జవాన్‌ ఉంటాడు. కానీ, శ్రీనివాస్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా ఒక జవాన్‌ను కాపలాకు కేటాయించినట్లు అధికారులు వివరించారు. అతనికి ప్రతిరోజూ దినపత్రిక, రెండుపూటల భోజనం అందిస్తున్నామన్నారు. అతనికి అందించే దినపత్రికలో అతనికి చెందిన వార్తలను కత్తిరించి ఇస్తున్నామన్నారు. 

వేములవాడ, ఆదిలాబాద్, సిరిసిల్లలో పోలీసులు
హాజీపూర్‌ కేసులో సిట్‌ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మర్రి శ్రీనివాసరెడ్డి గతంలో పనిచేసిన ఆదిలాబాద్, సిరిసిల్ల, వేములవాడలో సిట్‌పోలీసులు అతని గురించి ఆరా తీస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరి వద్ద పనిచేశాడు? ఎంతమంది స్నేహితులు ఉన్నారు. వేములవాడలో అతనితో చనువుగా మెలిగిన మహిళ ఎవరు? ఆమెను మాత్రం చంపకుండా ఎందుకు వదిలేశాడు? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.

ఫేస్‌బుక్‌ మిత్రుల పైనా..
శ్రీనివాస్‌రెడ్డి మహిళలకు రకరకాలుగా వలవేసి ఉచ్చులోకి లాగేవాడు. ఇందుకోసం ఫేస్‌బుక్‌ను కూడా వాడుకున్నాడు. 600మందికిపైగా ఉన్న అతని స్నేహితుల జాబితాల్లో కేవలం 50 మంది మాత్రమే పురుషులు, మిగిలిన వారంతా మహిళలే కావడం గమనార్హం. వీరిలో ఎవరెవ రితో చాటింగ్‌ చేశాడు. ఎలాంటి సంభాషణలు చేశాడు. వీడియోకాల్స్, మెస్సేజెస్‌ తదితర వివరా లను సేకరిస్తున్నారు. నిందితుడి మానసిక, నేరప్రవర్తనకు ఇవి నిదర్శనాలుగా నిలవనున్నాయి. ఫ్రెండ్స్‌లిస్టులో ఉన్నవారితో ఏమైనా సంబంధాలు నెరిపాడా? వారిలో ఎవరినైనా అంతమొందించాడా? అన్నది కూడా కేసు విచారిస్తోన్న ప్రత్యేక బృందం (సిట్‌) పరిశీలిస్తోంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top