
వనపర్తి క్రైం: చిన్నచిన్న కారణాలను సాకుగా చేసుకుని క్షణికావేశానికి లోనవుతున్నారు.. ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు.. పిల్లలను అనాథలను చేస్తున్నారు. కారణం ఏదైనా దాన్ని పరిష్కరించుకోలేక నిండు జీవితాన్ని అర్దాంతరంగా ముగిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినా.. ప్రేమ విఫలమైనా.. కుటుంబంలో కలహాలు వచ్చినా.. పరీక్షల్లో తప్పినా.. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువగా మహిళలు, యువకులే ఉన్నారు. కష్టనష్టాలు, అపజయాలు, కుటుంబకలహాలు తదితర సమస్యలు ఎదురైనప్పుడు మనోవేదనకు గురై చావే శరణ్యమనుకుంటున్నారు.
ఇవీ లక్షణాలు
ఆత్మహత్యకు పాల్పడేవారు దేనిపై శ్రద్ధ చూపరు. మానసికంగా బాధపడుతూ ఏదో పోగొట్టుకొని జీవితంపై విరక్తి కలిగినట్లుగా కనిపిస్తారు. ఎక్కువగా వీరు నిద్రలేకుండా ఉండటం, ఆందోళన, మానసిక ఓత్తిడి, కంగారు పడటం, తదితర సమస్యలతో బాధపడుతుంటారు. చిన్నచిన్న కారణాల చేత బలవన్మరణాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యువతి, యువకులు పరిక్షల్లో పేలయినా, ప్రేమలో విఫలమయినా చావును వెతుక్కుంటూ వెళ్తున్నారు. చాలామంది కుటుంబ కలహాలతో ఎంతో మంది మహిళలు ప్రాణాలు తీసుకుని కుటుంబానికి తీరని విషాదం నింపుతున్నారు.
ఒక్క క్షణం ఆలోచిస్తే..
ప్రతి చిన్న విషయానికి చావే శరణ్యమని భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం అంటూ ఏదో ఉంటుంది. అది తెలియక ఎందరో వ్యక్తులు తొందరపాటుకు గురవుతూ జీవితాన్ని ముగిస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచన చేస్తే వారిపై ఆధారపడిన వారు రోడ్డున పడతారనే విషయం గుర్తుకొస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్నేహపూర్వక వాతావరణం లేకపోవడంతో ప్రతి చిన్నదానికి వారితో చెప్పే ధైర్యం లేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముందువెనక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.
సమస్యను ౖధైర్యంగా ఎదుర్కోవాలి
ప్రతి చిన్న సమస్యకు చావే శరణ్యమని భావిస్తే ఎట్లా. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కోనాలి. భార్యాభర్తల మధ్య సర్దుబాటు లేకపోవడం, యువత చెడు అలవాట్లకు గురికావడంతో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత ప్రేమలో విఫలమైనా.. పరిక్షలో ఫేలైనా మనోధైర్యం కోల్పోతున్నారు. చనిపోయి అందరిని దూరమయ్యేదానికన్నా బతికుండి సమస్యను ఎదుర్కోవాలి. – రవిసాగర్, సైకాలజిస్ట్, వనపర్తి