మామ ఉసురు తీసిన అల్లుడు | Son In Law Killed uncle In Prakasam | Sakshi
Sakshi News home page

మామ ఉసురు తీసిన అల్లుడు

Sep 18 2018 3:05 PM | Updated on Sep 18 2018 3:05 PM

Son In Law Killed uncle In Prakasam - Sakshi

సాంబ్రాని సాహెబ్‌ మృతదేహం

దర్శి: పిల్లనిచ్చిన మామను అల్లుడు దారుణంగా కొట్టి చంపాడు. ఈ సంఘటన పట్టణంలోని జెండా చెట్టు పీర్ల చావిడి సెంటర్‌లో సోమవారం జరిగింది. వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే చెట్లూరి గాలీబ్‌ సాహెబ్‌ అలియాస్‌ సాంబ్రాని సాహెబ్‌ (69) పీర్లచావిడి వద్ద కూర్చొని ఉన్నాడు. ఆయన చిన్న కుమార్తె భర్త పానెం కరిముల్లా ఆవేశంగా వచ్చి సాంబ్రాని సాహెబ్‌ తల, ముఖంపై కర్రతో బలంగా మూడు దెబ్బలు కొట్టాడు. ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై కక్షతో మామను చంపేశాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. హత్య జరిగిన సమయంలో అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకోబోయే లోపే నష్టం జరిగిపోయింది.

హత్య సమయంలో హంతకుడు కరిముల్లా మద్యం తాగి ఉన్నాడని స్థానికులు తెలిపారు. కరిముల్లా లారీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. మద్యం తాగి వచ్చి భార్యను కొడుతుండేవాడు. ఆ బాధను భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి కారణం మామేనని కోపంతో అల్లుడు ఆయన్ను హత్య చేశాడు. మొహర్రం సందర్భంగా దుకాణాలకు వేసేందుకు సాంబ్రాని నూరుతుండగా పూటుగా మద్యం తాగి వచ్చిన అల్లుడు ఈ దారుణానికి పాల్పడి పరారయ్యాడని స్థానికులు తెలిపారు. గాలీబ్‌ సాహెబ్‌ దుకాణాల్లో సాంబ్రాని పొగ వేసి నిమ్మకాయలు కట్టి వ్యాపారం వర్థిల్లాలని ప్రార్థనలు చేస్తుంటాడు. ఆయన పట్టణంలో అందరికీ తెలిసిన వ్యక్తి. విషయం తెలుసుకున్న స్థానికులందరూ అయ్యోపాపం ఆయన్ను ఇలా చేశారా..అంటూ అల్లుడిని దుమ్మెత్తి పోస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement