తల్లిని కుర్చీకి కట్టేసి.. కత్తితో పోడిచేసి.. | Son Brutally Murdered Mother In Chennai For Property | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం అమ్మను హతమార్చిన కిరాతకుడు

Apr 16 2019 9:17 AM | Updated on Apr 16 2019 9:24 AM

Son Brutally Murdered Mother In Chennai For Property - Sakshi

బీసెంట్‌ రోడ్డులో హత్య జరిగిన అపార్ట్‌మెంట్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై : కన్న కొడుకే ఆమె పాలిట కాలయముడయ్యాడు. ఆస్తి కోసం అనేకసార్లు దాడిచేసి వేధించాడు. అమె అంగీకరించకపోవడంతో కన్నతల్లి అనే కనికరం లేకుండా అత్యంత కిరాతకంగా హతమార్చి పరారైన సంఘటన తమిళనాడులో కలకలం రేపింది. హతురాలు అన్నాడీఎంకే మాజీ ఎంపీ కుళందైవేలు భార్య. వివరాల్లోకి వెళ్తే.. అన్నాడీఎంకే మాజీ ఎంపీ కుళందైవేలు, భార్య రత్నం (63) దంపతులకు కుమార్తె డాక్టర్‌ సుధ (37), కుమారుడు ప్రవీణ్‌ (35) ఉన్నారు. కుళందైవేలు నాలుగేళ్ల క్రితం మరణించగా, కుమార్తె సుధ ఓ డాక్టర్‌ను వివాహమాడి తిరుప్పూరులో ఉంటోంది.

ప్రవీణ్‌ బీఈ చదువును మధ్యలోనే ఆపేసి విదేశాలకు వెళ్లడంతో చెన్నై బీసెంట్‌నగర్‌లోని లగ్జరీ బంగ్లాలో రత్నం ఒంటరిగా ఉంటోంది. నెల రోజుల క్రితం కుమారుడు ప్రవీణ్‌ ఒక యువతిని వెంటబెట్టుకుని చెన్నైలోని తల్లి వద్దకు వచ్చాడు. ఆ యువతి తన భార్య అని పరిచయం చేయడంతో తల్లీ కొడుకుల మధ్య గొడవ జరిగింది. చెన్నైకి వచ్చినప్పటి నుంచి ఆస్తి పంపకాలు చేయాలని వేధించసాగాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కుమార్తెకు ఫోన్‌చేసిన రత్నం.. ఆస్తిని పంచకుంటే హత్య చేస్తానని బెదిరించడమేగాక ప్రవీణ్‌ తనపై దాడిచేశాడని బోరున విలపిస్తూ చెప్పింది. దీంతో బీసెంట్‌నగర్‌లోని తన బంధువులకు సుధ ఫోన్‌చేసి ధైర్యం చెప్పాల్సిందిగా కోరింది. బంధువులు రత్నం ఇంటికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చి ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లగా.. నోట్లో కాగితాలు కుక్కి, ప్లాస్టిక్‌ వైరుతో కాళ్లు చేతులూ కట్టేసి.. గొంతు, కడుపులో కత్తితో పొడవడంతో ప్రాణాలొదిలిన స్థితిలో రత్నం రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పరారీలో ఉన్న ప్రవీణ్, అతనితో ఉన్న యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లండన్‌లో ఉంటున్న ప్రవీణ్‌ అక్కడే ఒక యువతిని రహస్యంగా వివాహం చేసుకున్నట్టు సమాచారం. అప్పులపాలు కావడంతో ఆస్తికోసం కన్నతల్లినే హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్‌ను పట్టుకునేందుకు మూడు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రవీణ్‌ విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాల్లో అలర్ట్‌ ప్రకటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement