వేధింపులతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

Software Employee Roopini Commits Suicide in Hyderabad - Sakshi

హైదరాబాద్‌ :  ప్రేమగా నటించి పెళ్లి చేసుకొని, ఆపై ఆస్తిలో సగం వాటా కావాలంటూ తల్లితో కలిసి వేధింపులకు దిగాడు. అత్తింటి వేధింపులు తాళలేని మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తనువు చాలించింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ రాంబాబు, మృతురాలి తండ్రి కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు దక్షణపు వీధి మార్కండేయస్వామి దేవాలయం సమీపంలో నివాసముండే పసుపులేటి రూపిణి (25) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఏలూరుకు చెందిన చండ్రల సందీప్‌రాజ మణికొండ సోలిటెయిర్‌ జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడు. సందీప్, రూపిణి రెండు నెలల పాటు ప్రేమించుకున్నారు.

దూరపు బంధువైన సందీప్‌ను పెళ్లి చేసుకుంటానని తండ్రి సత్యనారాయణతో చెప్పగా అందుకు నిరాకరించారు. పట్టువదలకుండా రూపిణి తల్లిదండ్రులను ఒప్పించింది. ఈ ఏడాది మార్చి 4న వివాహం జరిపించారు. ఏప్రిల్‌ నుంచి మణికొండ చిత్రపురి కాలనీలో ఎల్‌–4 ఫ్లాట్‌ నెంబర్‌ 111లో నివాసం ఉంటున్నారు. గతనెలలో సందీప్‌ తల్లి లలిత కొడుకు వద్దకు వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఆస్తిలో సగం వాటా తీసుకురావాలని రూపిణిని వేధించసాగారు. రూపిణి తండ్రికి ఫోన్‌ చేయడంతో బుధవారం హైదరాబాద్‌ వచ్చాడు. అల్లుడు, అతని తల్లికి సర్ది చెప్పి వెళ్లాడు. ఏలూరులో బస్సు దిగుతుండగానే మళ్లీ కూతురు ఫోన్‌ చేసి భర్త, అత్త గొడవ పడుతున్నారని కన్నీరుమున్నీరైంది. వెంటనే శనివారం రాత్రి మళ్లీ కూతురు వద్దకు వచ్చి వారితో మాట్లాడాడు. ఆదివారం ఉదయం 10 గంటలకు భర్త సందీప్, అత్త లలిత గుడికి వెళ్లగా టిఫిన్‌ తీసుకొస్తానని చెప్పి తండ్రి బయటకు వెళ్లాడు.

సత్యనారాయణ తిరిగి వచ్చేసరికి డోర్‌ వెనక నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచిన స్పందించకపోవడంతో తలుపులు విరగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఆస్తి కోసమే ప్రేమగా నటించి, తరువాత వేధింపులకు పాల్పడ్డారని తండ్రి సత్యనారాయణ ఆరోపించారు. తన కూతురు ఫోన్‌ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పడంతో వచ్చి సర్ది చెప్పానని, ఈలోపే ఘోరం జరిగిపోయిందని కన్నీళ్ల పర్వంతమయ్యారు. భర్త, అత్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top