
శివతేజరెడ్డి , మనోహర్, నిమ్స్ డైరెక్టర్
హైదరాబాద్: వేధింపుల కారణంగానే డాక్టర్ శివతేజరెడ్డి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నిమ్స్ యాజమాన్యాన్ని కోరింది. నిమ్స్ లెర్నింగ్ సెంటర్‌లో మంగళవారం రెసిడెంట్ డాక్టర్లు శివతేజ సంతాప సమావేశం నిర్వహించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమ్స్‌లో స్వేచ్ఛ లేదని, ఒత్తిడితో విధులు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శివతేజ తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లే సమయంలో వారికి వీడ్కోలు పలకడానికి వెళ్లేందుకు అతనికి ఫ్యాకల్టీ అనుమతి నిరాకరించినట్లు వారు ఆరోపించారు. ఫ్యాకల్టీల నుంచి వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయన్నారు. తాము రోజుకు 18 గంటల పాటు విధులు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయన్నారు.
ఇది ఒక న్యూరాలజీ విభాగానికే పరిమితం కాదని, అన్ని రెసిడెంట్ విభాగాల్లో సీనియర్ ఫ్యాకల్టీల వేధింపులకు జూనియర్లు బలి కావలసి వస్తోందని అన్నారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌కు అసోసియేషన్ వినతిపత్రం అందజేసింది. వేధింపులకు సంబంధించిన రుజువులను డైరెక్టర్‌కు అందజేసినట్టు తెలిసింది. దీనిపై 10 రోజుల్లో విచారణ జరగాలని, లేకుంటే తమ పోరాటం కొనసాగిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శివానందరెడ్డి, ప్రతినిధులు రఘు కిశోర్, అబ్బాస్ తెలిపారు. ఆత్మహత్య వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు నిమ్స్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, డీన్ పరంజ్యోతి, డాక్టర్ రమేశ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కె.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర విచారణ జరిపిస్తాం
ఇటువంటి సంఘటనలు ఇంతవరకు నా దృష్టికి రాలేదు. శివతేజ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై సమగ్రమైన విచారణ చేయిస్తాను. అందుకు ఎవరు బాధ్యులైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. గతంలో నా దృష్టికి ఒక సమస్య వస్తే దాని పరిష్కారం కోరుతూ మెడికల్ కౌన్సిల్‌కు లేఖ పంపిన సందర్భాలు ఉన్నాయి. రెసిడెంట్ డాక్టర్లు ప్రశాంతమైన వాతావరణంలో విధులు నిర్వహించేలా చేస్తాను.
– మనోహర్, నిమ్స్ డైరెక్టర్