
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ సాయికృష్ణ, చిత్రంలో డీఎస్పీ మహబూబ్‌బాషా
కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : మచిలీపట్నం చిలకలపూడిలో వెండి వస్తువులను మాయం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.5 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ సోమవారం చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన జమ్ము దుర్గాప్రసాద్ నాలుగేళ్ళ క్రితం జీవనం కోసం మచిలీపట్నం వచ్చాడు. బొంతు రమణ అనే వ్యక్తితో కలిసి చిలకలపూడి సెంటర్ బొమ్మలగుడి సమీపంలో చిన్నపాటి షాపు అద్దెకు తీసుకుని వెండి పనులు చేస్తున్నాడు. వీరిరువురు చిలకలపూడిలోని కొండవీటి సాయిసత్యబాబు ఇంట్లో ప్రతి రోజు భోజనం చేసేలా మాట్లాడుకున్నారు.
రాత్రికి దుర్గాప్రసాద్ బలరామునిపేటలోని తన ఇంటికి వెళ్ళిపోగా రమణ.. సత్యబాబు ఇంట్లో పడుకునేవాడు. వీరి పనులు దినదినాభివృద్ధి చెందుతుండగా వ్యసనాలకు బానిసైన సత్యబాబు ఈ నెల 13వ తేదీన రమణ నిద్రలో ఉండగా షాపు తాళాలను అపహరించాడు. మరుక్షణం షాపు వద్దకు వెళ్ళి రూ.5 లక్షల విలువ గల వెండి ఆభరణాలు దొంగిలించాడు. వాటిని తన ఇంటి అటకపై దాచేసి మరలా రమణ పక్కన నిద్రిస్తున్నట్లు నటించాడు. మరుసటి రోజు దుర్గాప్రసాద్, రమణ షాపు తెరిచి చూడగా 15 కిలోల వెండి వస్తువులు కనిపించలేదు. అదే రోజు దుర్గాప్రసాద్ చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తులో సత్యబాబుపై అనుమానం రాగా అదుపులోకి తీసుకుని విచారించారు. వెండి వస్తువులు అపహరించింది సత్యబాబు అనే నిర్ధారణకు వచ్చారు. అతని నుంచి వెండి వస్తువులను రికవరీ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. చోరీకి పాల్పడిన సత్యబాబును అనతికాలంలో పట్టుకున్న చిలకలపూడి పోలీసులను అడిషనల్ ఎస్పీ అభినందించారు. ఎస్పీ వారికి రివార్డులు ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, స్టేషన్ సిబ్బంది పాల్, మల్లి తదితరులు పాల్గొన్నారు.