నటి హత్య: శరీరంలోని ఇతర భాగాల కోసం గాలింపు.. | Sakshi
Sakshi News home page

వీడిన మిస్టరీ

Published Thu, Feb 7 2019 11:03 AM

Side Actress Sandhya Murder Case Mysery Reveals in Tamil Nadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: సహాయనటిగా సహచరులతో పెట్టుకున్న వివాహేతర సంబంధాలు వివాహబంధానికి ఎసరుపెట్టాయి. సినీ జీవితంపై ఆమె పెంచుకున్న మోజు నిజజీవితాన్ని ఛిద్రం చేసింది. మూడుముళ్లు వేసిన భర్త చేతిలోనే ముక్కలుముక్కలుగా మారి ప్రాణాలు విడిచింది. తల్లి పరలోకానికి, తండ్రి కటకటాల వెనక్కి వెళ్లిపోగా ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. చెన్నై పెరుంగుడి చెత్తకుప్పల్లో గత నెల 21వ తేదీన దొరికిన గుర్తుతెలియని యువతి అవయవాల మిస్టరీ ఎట్టకేలకూ రెండువారాల తరువాత వీడింది. దారుణమైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై శివారు పెరుంగుడిలోని చెత్తకుప్పల్లో గుర్తుతెలియని యువతికి చెందిన రెండు కాళ్లు, ఒక చెయ్యిని గత నెల 21వ తేదీన పోలీసులు కనుగొన్నారు. మృతురాలి ఆచూకీ కోసం ఆనాటి నుంచి అనేక చోట్ల వెతికారు. పొరుగు రాష్ట్రాల్లో సైతం అన్వేషించారు. యువతి అదృశ్యం కేసులేవీ పోలీసుస్టేషన్లలో నమోదు కాకపోవడం, మృతురాలి చేతిపై ఉన్న టాటూ మినహా మరే ఆధారాలు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. ఒక వేళ భర్త చేతిలోనే ఆమె హత్యకు గురికావడం వల్లనే పోలీసు కేసులేవీ నమోదు కాలేదనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చివరకు అదే నిజమైంది. చెన్నై ఈక్కాడుతాంగల్‌లో నివసించే కన్యాకుమారీ జిల్లా నాగర్‌కోవిల్‌ చెందిన సంధ్య (38) అనే యువతి కొన్నిరోజులుగా కనపడడం లేదని స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారంతో తెలుసుకున్నారు. అదృశ్యమైన యువతి భర్త సినీ దర్శకుడైన బాలకృష్ణన్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రహస్యప్రదేశంలో ఉంచి తమదైన శైలిలో విచారించారు. తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పోలీసుల కథనం ఇలా ఉంది.

కన్యాకుమారీ జిల్లా నాగర్‌కోవిల్‌ అరుంనల్లూరుకు చెందిన సంధ్య సినీనటిగా చాన్సుల కోసం చెన్నైలో ప్రయత్నాలు చేసేటప్పుడు సినీ దర్శకుడైన బాలకృష్ణన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీయగా ఇరు కుటుంబాల సమ్మతితో  2010లో వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు, కుమార్తె తూత్తుకూడిలోని నాన్నమ్మ, తాత వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. చెన్నై ఈక్కాడుతాంగల్‌లో నివసించే బాలకృష్ణన్‌ కోసం ఇంటికి సినీరంగంతోపాటు పలురంగాలకు చెందిన వారు వచ్చి వెళుతుండేవారు. అలాగే నటిగా ఆమెకూ అనేక పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆమె కొందరితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు సమాచారం. భర్త అనుమానించేలా రాత్రివేళల్లో సెల్‌ఫోన్‌లో గంటలతరబడి మాట్లాడడం, బయటకు వెళ్లడం వంటి చర్యలకు పాల్పడేది. దీంతో దంపతుల మధ్య విభేదాలు పొడచూపాయి. పద్ధతి మార్చుకోవాలని, సినిమాల్లో నటించడం మానేసి పిల్లలను చూసుకోవాలని బాలకృష్ణన్‌ అనేకసార్లు మందలించినా ఆమె వినిపించుకోలేదు.

తన జీవితానికి అడ్డురావద్దని ఆమె ఎదురుతిరగడంతోపాటూ ఇరువురూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దశలో సంధ్య తన భర్త ఎదురుగానే ప్రియునితో మరింత విచ్చలవిడిగా వ్యవహరించడంతో బాలకృష్ణన్‌మరోసారి మందలించి కలిసి జీవిద్దామని కోరాడు. అయితే ఆమె ఇందుకు నిరాకరించి ప్రియునితోనే ఉంటానని తేల్చిచెప్పింది. దీంతో అప్పటికే తగిన ఏర్పాట్లలో ఉన్న బాలకృష్ణన్‌ గత నెల 19వ తేదీ రాత్రి జంతువులను వధించే కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు 20వ తేదీన మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నాలుగుపార్శిళ్లుగా నగరంలోని పలు ప్రాంతాల్లో పడేశాడు. ఇక తనను తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. 21వ తేదీన పెరుంగుడి చెత్తకుప్పల నుంచి హతురాలి అవయవాలు బైటపడడంతో పోలీసులు కూపీలాగి నిందితుడిని కటకటాల వెనక్కునెట్టారు. సంధ్య తల, పొట్టభాగాన్ని చెన్నై నుంగంబాక్కంలో పడేసినట్లు నిందితుడు చెప్పగా అక్కడ అవి దొరకలేదు. ఇప్పటి వరకు దొరికిన అవయవాలను మార్చురీలో భద్రం చేసి సంధ్య తల కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. సంధ్య హత్యవార్తను బుధవారం ఉదయం టీవీల్లో చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కొందరు బంధువులను తోడుగా తీసుకుని సాయంత్రానికి చెన్నైకి చేరుకున్నారు. సినిమా వ్యామోహమే సంధ్యకు ప్రాణాంతకమైందని కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
Advertisement