
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : క్షణికావేశంలో ఇతరులపై దాడులు చేసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతుంది. తాజాగా ఓ షాపు యాజమాని తన షాపు ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై యాసిడ్ దాడి చేశాడు. మంగళవారం షహదర ప్రాంతంలోని గాంధీనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలవరం రేపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. బాలుడు అల్లరి చేస్తున్నాడనే కారణంతోనే నిందితుడు ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
గత ఏడాది వాయువ్య ఢిల్లీలోని భరత్‌నగర్‌లో 70 ఏళ్ల వృద్దుడు ఇదే తరహాలో ఇద్దరు మహిళలు, ఆరుగురు పిల్లలపై యాసిడ్ దాడి చేశాడు. పిల్లలు తన ఇంటి ముందు అల్లరి చేస్తుడటంతో వారిని పక్కకి వెళ్లి ఆడుకోవాల్సిందిగా కోరానని, వారు వినకపోవడంతో దాడి చేశానని అతడు పోలీసులకు తెలిపాడు. చిన్నపిల్లలపై ఈ తరహ దాడులు జరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.