నిజంగానే నోరు విప్పలేదా? | Sakshi
Sakshi News home page

నిజంగానే నోరు విప్పలేదా?

Published Tue, Oct 30 2018 4:35 AM

Senior IPS Officers is Doing strategic conspiracy in the Case Inquiry - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ పోలీస్‌ కమిషనర్, ఐజీ మహేష్‌ చంద్ర లడ్హా... ఇటీవలే కర్నూలు ఎస్పీగా బదిలీ అయినప్పటికీ కేసు విచారణ నిమిత్తం ఇక్కడే ఆగిపోయిన డీసీపీ ఫకీరప్ప ఐపీఎస్‌.. నగరానికి కొత్తగా వచ్చిన ఐపీఎస్‌ అధికారి డీసీపీ రవీంద్రనాథ్‌.. ఇంకా నలుగురు ఏసీపీలు... మరో పదిమంది సీఐలు.. పదుల సంఖ్యలో ఎస్‌ఐలు, ఆర్‌ఐలు... ఇక లెక్కలేనంత మంది కానిస్టేబుళ్లు...! ఇంతమంది ఎందుకో తెలుసా? ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావును విచారిస్తున్న అధికారుల బృందం ఇదీ. వీరిలో ఐజీ లడ్హా ట్రాక్‌ రికార్డు తక్కువేం కాదు. ఆయన ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు నక్సలైట్లను మట్టుబెట్టి వారి హిట్‌లిస్ట్‌లోకి ఎక్కారు. ఇక మిగిలిన అధికారులకు బోలెడు చర్రిత ఉంది. మరి ఇంతమంది అధికారులు, వందల మంది పోలీస్‌ సిబ్బంది కలిసి కూడా నిందితుడు శ్రీనివాసరావు నుంచి.. ‘నేను చెప్పాల్సిందంతా లేఖలోనే రాశా.. ’ అనేది మినహా అదనంగా ఒక్క ముక్క కూడా సమాచారం రాబట్టలేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నిందితుడి నుంచి నిజంగానే నిజాలు రాబట్టలేకపోతున్నారా? లేక ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగి నిజాలను వెలికి తీయాలని భావించడం లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నో కేసులను ఛేదించిన ఘనత ఉన్న ఇంతమంది అధికారులు నిందితుడు శ్రీనివాసరావు నుంచి కనీస సమాచారం కూడా రాబట్టలేకపోవడం చూస్తుంటే వ్యూహాత్మకంగానే కేసును నీరుగార్చేయాలన్న కుట్ర కనిపిస్తోందన్న వాదనలకు బలం చేకూరుతోంది. 

చెదరని క్రాఫ్‌.. చిరునవ్వులు చిందిస్తూ..
జేబు దొంగలు, సినిమా హాళ్ల వద్ద బ్లాక్‌ టికెట్లు అమ్ముకునే వారిని కూడా స్టేషన్‌లో తలకిందులుగా వేలాడదీసి భయభ్రాంతులకు గురిచేసే పోలీసులు ప్రధాన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావును మాత్రం నెత్తిన క్రాఫ్‌ చెదరకుండా, ముఖంలో చిరునవ్వు చెదరకుండా, ఎంతో మర్యాదగా రోజూ బిర్యానీలు వడ్డిస్తూ విచారణ చేస్తుండటం విస్తుగొలుపుతోంది. దాదాపు మూడు రోజులుగా విచారణ చేస్తున్నా నిందితుడు సహకరించడం లేదని, ఏమీ మాట్లాడటం లేదని, అంతా లేఖలోనే రాశానని చెబుతున్నాడని స్వయంగా విశాఖ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్హా చెబుతున్నారు. కేంద్ర బలగాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నానికి తెగబడటం మామూలు విషయం కాదు. ఒక్క వేటుతో గొంతులోకి కత్తి దించి ప్రాణాలు హరించడమే లక్ష్యంగా ఘాతుకానికి తెగించిన శ్రీనివాసరావుకు ఇదంతా చేయమని నూరిపోసిందెవరు? నిందితుడిని ప్రేరేపించి ఏం జరిగినా తాము చూసుకుంటామని అభయం ఇచ్చిందెవరు? పక్కా పథకం ప్రకారం పది నెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే మకాం వేయించి ఉసిగొల్పిందెవరు..? అనే కీలక విషయాలను పోలీసు అధికారులు సూత్రప్రాయంగా కూడా రాబట్టలేకపోయారు. 

ఇవాళ ఏమీ లేదు.. రేపు చూద్దాం
జైలు నుంచి పోలీస్‌ కస్టడీకి తీసుకున్న రెండో రోజు సోమవారం కూడా కేసు పురోగతిలో ఏమీ సాధించలేకపోయామని ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ మళ్ళ శేషు చెప్పారు. సోమవారం రాత్రి ఆయన స్టేషన్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఇవాళ డెవలప్‌మెంట్స్‌ ఏమీ లేవు.. రేపు చూద్దాం.. అని పేర్కొన్నారు. కుట్రకు కేంద్రంగా భావిస్తున్న  శ్రీనివాసరావు పనిచేసిన ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన హర్షవర్ధన్‌చౌదరిని ఎట్టకేలకు ఆదివారం ప్రశ్నించిన పోలీసులు.. సోమవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో మరోసారి పిలిచినా ఎలాంటి విచారణ చేయలేదు. రెస్టారెంట్‌లో పనిచేసే కొందరు మహిళా సిబ్బందిని ఆయన వెంట తిరిగి పంపినట్లు తెలిసింది. 

అవే సమాధానాలు
ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు పోలీస్‌ కస్టడీలో రెండో రోజు కూడా నోరు మెదప లేదు. నిందితుడు నవ్వుతూ బెరుకు, భయం లేకుండానే కనిపించాడంటున్నారు. కుట్ర కోణంపై ఎన్ని విధాలుగా ప్రశ్నలు సంధించినా ఒకటే సమాధానం చెబుతుండడంతో మానసికంగా అంత ధృఢంగా ఎలా ఉండగలుగుతున్నాడో విశ్లేషించాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఫ్యూజన్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌లో చేరినప్పటి నుంచి నిందితుడి కదలికలను పరిశీలించేందుకు ఎయిర్‌పోర్టులో సీసీ పుటేజ్‌ను సేకరించి విశ్లేషిస్తున్నారు. నిందితుడు హోటల్‌లో ఎలా ఉండేవాడు..? డ్యూటీ అయిపోయిన తర్వాత ఎలా ప్రవర్తించేవాడు? హోటల్‌లో ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు? మాట్లాడేటప్పుడు ఎలా ఉండేవాడో పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మానసిక వైద్యుల పర్యవేక్షణలో సీసీ పుటేజ్‌లను పరిశీలించాలని భావిస్తున్నట్లు ‘సిట్‌’ వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు గతంలోనూ ఎక్కడా ఎక్కువ రోజులు ఉద్యోగం చేయలేదని తేలడంతో ఆ వివరాల సేకరణపైనా దృష్టి పెట్టారు. స్వగ్రామంలో నిందితుడిపై నమోదైన కేసు గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
Advertisement