మూగజీవి అని కూడా చూడకుండా..

Security Guards Thrash Street Dog With Batons In Gurugram - Sakshi

గురుగ్రామ్‌ : ఓ వీధి కుక్కపై కొందరు సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా దాడికి పాల్పడటం గురుగ్రామ్‌లో కలకలం రేపింది. మూగజీవి అని కూడా చూడకుండా దారుణంగా హింసించారు. అంతేకాకుండా బతికుండానే దానిని పాతిపెట్టేందుకే యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌ సెక్టార్‌ 49లోని ఓ కాస్ట్‌లీ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోకి శుక్రవారం సాయంత్రం ఓ వీధి కుక్క ప్రవేశించింది. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ గార్డులు వీధి కుక్కను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ కుక్క బయటకు వెళ్లలేదు.   

దీంతో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ ఆదేశాల మేరకు అక్కడి గార్డులు కుక్కపై తమ వద్ద ఉన్న లాఠీలతో దాడి చేశారు. అది మూగజీవి అన్న సంగతి మరచి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో కుక్క కాలుకు, తలకు బలమైన గాయాలు కావడంతో అది అక్కడే నేలమీద పడిపోయింది. అలా పడిపోయిన కుక్కను అపార్ట్‌మెంట్‌ బయటకు తీసుకెళ్లిన సెక్యూరిటీ గార్డులు.. ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే దీనిని గమనించిన కొందరు జంతు ప్రేమికులు గార్డుల చర్యను అడ్డుకున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన కుక్కను.. దగ్గర్లోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ కుక్క పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. జంతు పరిరక్షణ చట్టం ప్రకారం ఆ అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ గార్డులు, వారి సూపర్‌వైజర్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. అక్కడ సీసీటీవీ దృశ్యాల్లో వారు కుక్కను హింసించిన దృశ్యాలు నమోదయ్యాయని.. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

కుక్కపిల్లలపై విద్యార్థుల దాడి..
బెంగళూరు : అలాగే బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నలుగురు స్కూల్‌ విద్యార్థులు.. ఓ ఖాళీ ప్లాట్‌లో నిద్రిస్తున్న కుక్క పిల్లలపై దాడికి ప్పాలడ్డారు. వాటిపైకి రాళ్లు రువ్వారు. దీంతో అవి అరవడం మొదలు పెట్టాయి. ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడి చేరుకుని విద్యార్థులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారు అప్పటికే అక్కడ నుంచి పారిపోయారు. సాయంత్రం తిరిగి అక్కడికి వచ్చినవారు.. ఒక కుక్కపిల్లను రాడ్డుతో గట్టిగా కొట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆ కుక్క పిల్లను స్థానికులు దగ్గర్లోని వెటర్నరీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. మళ్లీ మూడోసారి అక్కడికి వచ్చిన విద్యార్థులు మిగిలిన రెండు కుక్కపిల్లలపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. 

ఆ విద్యార్థుల పనులతో ఆగ్రహానికి లోనైన ఓ స్థానికుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆ విద్యార్థులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల దాడిలో గాయపడ్డ ఆ మూగజీవాలను ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్చారు. అందులో ఓ కుక్కపిల్లకు దవడ విరిగినట్టు వైద్యులు గుర్తించారు. కాగా, ఆ విద్యార్థుల వయసు 7 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top