హత్య.. ఆపై హత్యలు

Sanjay Kumar Held in 10Assassinated Case Warangal - Sakshi

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో తొలుత మహిళ హత్య

ఆపై బంధువులు ఆరా తీస్తుండడంతో ఆరుగురిని మట్టుపెట్టేందుకు స్కెచ్‌

మరో ముగ్గురు ఉండడంతో వారినీ ఖతం చేసిన వైనం

అర్ధరాత్రి వేళ తాపీగా పని పూర్తిచేసిన నిందితుడు

సీసీ పుటేజీలతో పాటు సాంకేతిక అంశాల ఆధారంగా కేసు విచారణ

వివాహితతో ఏర్పడిన పరిచయం ఆపై సాన్నిహిత్యంగా.. అది కూడా దాటిపోయి శారీరకంగా సంబంధానికి దారి తీసింది.. అంతటితో ఆగక ఆమె కుమార్తెతోనూ సంబంధం ఏర్పర్చుకోవాలని భావించగా గుర్తించిన వివాహిత తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది.. ఆమెను అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసిన నిందితుడు, ఆమె కోసం ఆరా తీసిన కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు సిద్ధమయ్యాడు.. ఈ కుటుంబంలోని ఆరుగురికి తోడు పక్కనే ఉన్న పాపానికి మరో ముగ్గురు బలి కాగా.. మొత్తం తొమ్మిది మంది మృతదేహాలు వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట వద్ద బావిలో తేలిన ఘటన రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది. ఈ కేసును 72 గంటల్లో ఛేదించిన పోలీసులు బీహార్‌కు చెందిన నిందితుడు సంజయ్‌కుమార్‌ను యాదవ్‌ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా తొలుత తాను మహిళను హత్య చేశానని.. ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తొమ్మిది హత్యలు చేసినట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు వివరాలను మీడియాకు సీపీ రవీందర్‌ సోమవారం సాయంత్రం వెల్లడించారు.

సాక్షి ప్రతినిధి వరంగల్‌ / కాజీపేట అర్బన్‌ / గీసుకొండ : ఒక తప్పు చేస్తే అలాంటి తప్పు మరోసారి జరగకుండా చూసుకోవాలి.. అప్పుడే మనిషిలో పరివర్తన వచ్చినట్లు లెక్క! కానీ ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తూ వెళ్తే దానికి అంతమనేదే ఉండదు. అచ్చంగా తొమ్మిది మృతదేహాలు లభించిన కేసులో నిందితుడు ఇలాగే చేస్తూ పోయాడు. గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో లభించిన మృతదేహాల విషయంలో ఆత్మహత్యలా, హత్యలా అనే కోణం దర్యాప్తు చేసిన పోలీసులకు సీసీ ఫుటేజీల రూపంలో ఓ తీగ దొరికింది. ఆ తీగ ఆధారంగా ముందుకెళ్లగా నిందితుడు దొరికాడు. విచారణ సందర్భంగా.. ఈ తొమ్మిది హత్యలకు గతంలో తానే చేసిన ఓ హత్య నాంది అని నిందితుడు చెప్పడం గమనార్హం.

కేసు వివరాలను వెల్లడిస్తున్న సీపీ రవీందర్, పక్కన అధికారులు
పని కోసం వచ్చాక పరిచయం
వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బార్‌దాన్‌ గోదాంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్‌ మక్సూద్‌ ఆలం(47), ఆయన భార్య నిషా(40) పనిచేసేవారు. వీరితో పాటు మక్సూద్‌ కుమారులు షాబాజ్‌(19), సోహిల్‌ ఆలం(18)తో పాటు ఆయన కుమార్తె బుష్రా ఖాతూన్, ఆమె కుమారుడు బబ్లూ నివసించేవారు. ఈక్రమంలో బార్‌దాన్‌ పనికి వచ్చిన బీహార్‌ వాసి సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌కు వీరితో పరిచయం ఏర్పడింది. ఇంతలోనే మక్సూద్‌ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా(31) భర్తతో విడిపోయాక ముగ్గురు పిల్లలతో కలిసి పని కోసం వచ్చింది. ఆమెతోనూ çసంజయ్‌ పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు తనకు హోటళ్లలో తినడం ఇబ్బందిగా ఉందని చెబుతూ డబ్బు చెల్లించేలా మాట్లాడుకుని రఫీకా ఇంట్లో భోజనం చేయడం ఆరంభించాడు. ఆ పరిచయం సాన్నిహిత్యానికి.. ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది.

వివాహితతో పాటు ఆమె కుమార్తెతో..
మక్సూద్‌ సమీప బంధువైన రఫీకాతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆమె కుటుంబం మకాంను సంజయ్‌ జాన్‌పాకకు మార్చాడు. అక్కడ అద్దె ఇంటిని తీసుకుని వారితోనే ఉండసాగాడు. అప్పటికే యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెపై సంజయ్‌ కన్ను పడింది. ఈ విషయం రఫీకాకు తెలియగా నిలదీయడమే కాకుండా త్వరగా తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్‌ చేయసాగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన సంజయ్‌.. బంధువులతో మాట్లాడాలంటూ పశ్చి మ బెంగాల్‌ బయలుదేరదీశాడు. విశాఖ వైపు గరీభ్‌ర థ్‌ రైలులో మార్చి 6న వెళ్లే క్రమంలో అప్పటికే సి ద్ధం చేసుకున్న నిద్రమాత్రలను మజ్జిగలో కలిపి ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితికి చేరుకున్న రఫీకా మెడకు చున్నీ బిగింగి రైలు నుంచి ఏపీలోని నిడదవోలు వద్ద తోసివేశాడు. ఆ తర్వాత రాజమండ్రిలో దిగి మరో రైలులో వరంగల్‌ వచ్చాడు.

ఆమె ఎటు వెళ్లింది..?
తాపీగా వచ్చిన సంజయ్‌ పని చేసుకుంటున్నాడు. అయితే, రఫీకా విషయమై నిషా సంజయ్‌ను గట్టిగా అడగసాగింది. పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో ఈ కుటుంబం అడ్డు కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాడు.

నిందితుడు సంజయ్‌ సైకిల్‌
కొడుకు పుట్టిన రోజే అందరికీ చివరి రోజు
సంజయ్‌కుమార్‌ యాదవ్‌.. మక్సూద్‌ ఆలం కుటుంబాన్ని హతమార్చేందుకు ఈనెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెక్కీ నిర్వహించాడు. ప్రతీరోజూ సైకిల్‌పై వారు నివాసం ఉండే ఇంటికి వెళ్లి వస్తూ పరిశీలించాడు. ఈ కుటుంబంలో ఐదుగురికి తోడు పక్కన మరో భవనం పైభాగంలో నివాసముంటున్న బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంను గుర్తించాడు. చివరకు ఈనెల 20వ తేదీన మక్సూద్‌ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్‌ ఆలం పుట్టినరోజు అని తెలుసుకుని సాయంత్రం వెళ్లాడు. మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేసిన నిద్రమాత్రలను మక్సూద్‌ ఆలం కుటుంబంతో మాటల్లో ఉండగా పప్పు కూరలో కలిపాడు, అదే విధంగా శ్రీరాం, శ్యాం ఆహారంలో కూడా కలిపాడు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లు, సామగ్రి
ఒక్కరొక్కరిని..
రాత్రి 12 గంటల వరకు అందరూ మత్తులో చేరుకోగా ఒకరి వెంట ఒకరిని గోనె సంచిలో పెట్టుకుని తీసుకొచ్చాడు. గోదాం – బావి మధ్య ఉన్న ప్రహరీపై ఆయన ఒక్కరొక్కరిని ఉంచాడు. ఆ పై తాను గోడ దూకి వారిని తీసుకెళ్లి బావిలో పడవేయసాగాడు. ఉదయం 5.30 గంటలకు మృతులు వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసి వస్తువులు, సెల్‌ఫోన్లు తీసుకుని జాన్‌పాక చేరుకున్నాడు.

6 బృందాలు... 72 గంటలు
తొమ్మిది మంది మృతి చెందిన కేసును వరంగల్‌ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని విభాగాల అధికారులతో కలిపి ఆరు బృందాలు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా సంజయ్‌ను గుర్తించగా.. సోమవారం సాయంత్రం మీడియాకు సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ వివరాలు వెల్లడించారు. కాగా, తొలుత హత్యకు గురైన రఫీకా ముగ్గురు పిల్లలను బాలసదనంలోకి చేర్చినట్లు వివరించారు. కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్‌ ఇన్‌చార్జి డీసీసీ వెంకటలక్ష్మి, ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్లు శివరామయ్య, కిషన్, ఇన్‌స్పెక్టర్లు నందిరాంనాయక్, జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్, రమేష్‌కుమార్‌ను సీపీ అభినందించారు.

రంజాన్‌ జరుపుకోకుండానే..
రంజాన్‌ జరుపుకునేందుకు ముస్లిం కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటాయి. అదే తరహాలో మక్సూ ద్‌ ఆలం కుటుంబం కూడా కొత్త బట్టలు, సరుకులు కొనుగోలు చేశారు. కానీ వారిని మృత్యువు వెంటాడింది. ఆ కుటుంబంలో ఒక్కరూ బతికి లేకపోవడంతో పండుగ జరుపుకోలేకపోయారు.

రెండున్నర అడుగల ఎత్తులో బావిగోడ
మృతదేహాలు తేలిన బావి చుట్టూ ప్రహారీ ఉంది. ఒకచోట మాత్రం మట్టితో 2.5 అడుగుల గోడ ఉంది. అక్కడి నుంచే సంజయ్‌.. మత్తులో ఉన్న వారిని బావిలోకి తోసినట్లు చెబుతున్నారు.

పాపం.. ఆ ముగ్గురు
తొలుత మక్సూద్‌ కుటుంబంలోని ఆరుగురిని మాత్రమే సంజయ్‌ అంతం చేయాలనుకున్నాడు. కానీ వారి ఇంటి పక్కనే ఉండే బీహార్‌ కార్మికులు శ్రీరాం, శ్యాంతోపాటు పని ఉందని చెప్పడంతో వచ్చిన షకీల్‌ కూడా బలయ్యారు.

మార్చురీలోనే మృతదేహాలు
ఎంజీఎం : బావిలో తేలిన తొమ్మిది మంది మృతదేహాలు ఇంకా ఎంజీఎం మార్చురీలోనే ఉన్నా యి. కేసు ఓ కొలిక్కి వచ్చినా సోమవారం రంజా న్‌ కావడంతో మంగళవారం మృతదేహాల ను ఖ ననం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఎప్పుడేం జరిగిందంటే...
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తొమ్మిది హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితుడి వివరాలను సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బావిలో నాలుగు మృతదేహాలు తేలిన రోజు నుంచి నిందితుడి వివరాలు వెల్లడించిన సోమవారం వరకు జరిగిన ఘటనల వివరాలివి..

నిందితుడు సంజయ్‌ను తీసుకొస్తున్న పోలీసులు
21 – 05 – 2020 : గురువారం
వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో సాయిదత్తా ట్రేడర్స్‌ ఆధ్వర్యాన నిర్వహించిన బార్‌దాన్‌ సంచులను కేంద్రానికి ఆటోడ్రైవర్‌ను అక్కడకు పంపించారు. నిల్వ ఉన్న సంచులను తీసుకురావాలని సూచించారు. ఆటో డ్రైవర్‌ ఉదయం 7 గంటలకు వెళ్లగా అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో యజమానులకు సమాచారం ఇచ్చాడు. దీంతో యజమానులు భాస్కర్, సంతోష్‌ చేరుకుని చూడగా ఎవరూ లేకపోవడంతో పనిపై బయటకు వెళ్లారని భావించారు. మళ్లీ కాసేపటికి వెళ్లి చూడగా కూడా లేకపోవడంతో బీహార్‌ కార్మికులు ఉండే భవనం ఎక్కి చూడగా పక్కనే పాడుబడిన వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు తేలడాన్ని గమనించి గీసుకొండ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సాయంత్రం వరకు మహ్మద్‌ మక్సూద్‌ ఆలం(47), ఆయన భార్య నిషా ఆలం(40), కుమార్తె బుష్రా ఖాతూన్‌(20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారు బబ్లూ మృతదేహాలను వెలికితీశారు.  

ఘటనా స్థలాన్ని ఈస్ట్‌ జోన్‌ అదనపు డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి సీఐలు జూపల్లి శివరామయ్య, కిషన్, ఎస్‌లు రహీం, నాగరాజు పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వార్డ్‌ను రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. మ«ధ్యాహ్నం 2నుంచి రాత్రి 8 గంటల వరకు గాలించినా ఏ ఆధారమూ లభించకపోవడంతో నలుగురు ఎలా మృతి చెంది ఉంటారనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోయారు.

22 – 05 – 2020 : శుక్రవారం
ఉదయం 7 గంటలకు బావి వద్దకు స్థానికులు వెళ్లి చూడగా ఓ మృతదేహం తేలుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌తో పాటు పోలీసు అధికారులు చేరుకుని సిబ్బందితో గాలించారు. దీంతో తొలుత మక్సూద్‌ ఆలం స్నేహితుడు, కరీమాబాద్‌కు చెందిన మహ్మద్‌ షకీల్‌(38) మృతదేహం బయటపడినా ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత బావిలోని నీటిని మోటార్‌ సాయంతో తోడుతుండగా చొప్పున నాలుగు మృతదేహాలు లభించాయి. ఇందులో మక్సూద్‌ పెద్ద కుమారుడు షాబాజ్, బీహార్‌ కార్మికుడు శ్రీరాంకుమార్‌షా, మక్సూద్‌ చిన్న కుమారుడు మహ్మద్‌ సుహేల్, బీహార్‌ కార్మికుడు శ్యాంకుమార్‌షా మృతదేహాలను వెలికితీసి వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి తరలించారు.

బార్దాన్‌ గోదాంలోని మక్సూద్‌ కుటుంబం నివాసం ఉండే రెండు గదులతో పాటు, బీహార్‌ కార్మికులు ఉండే డాబా పైగదులు, బావి పరిసర ప్రాంతాల్లో క్లూస్‌టీం ఆధారాల కోసం పలు నమూనాలు సేకరించింది. వండి తినకుండా మిగిలిపోయిన అన్నం, ఆకుకూర పప్పు, కూల్‌డ్రింక్స్‌ ఖాళీ బాటిళ్లను తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని సీపీ రవీందర్‌ సందర్శించారు.

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి  మార్చురీలో మృతదేహాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్, వరంగల్‌ అర్బన్, రూరల్‌ కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, హరిత సందర్శించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేసినట్లు మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు.

23 – 05 – 2020 : శనివారం
సంఘటనా స్థలానికి సెంట్రల్‌ విజిలెన్స్‌ అధికారుల బృందం, హైదరాబాద్‌ నుంచి ఫోరెన్సిక్‌ విభాగం అధికారులు చేరుకుని సాంకేతిక పరమైన అంశాలను పరిశీలించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్‌  పోలీసులు పలు కోణాల్లో పరిశోధనలు చేశారు. మృతదేహాల పోస్టుమార్టం నివేదికను పరిశీలించారు. ప్రాణాలతో ఉండగానే బావిలో పడేశారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కాల్‌డేటా ఆధారంగా సంజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని ఘటనాస్థలికి తీసుకుని వచ్చి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ తరహాలో పరిశీలించారు. డీసీసీ వెంకటలక్ష్మి నేతృత్వంలో ఐదు గంటల పాటు పరిశీలన జరిపారు.

ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని, మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని  రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ సీపీని ఆదేశించారు.
రాత్రి  తొమ్మిది మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. నీట మునిగాక మృతి చెందినట్లు ప్రాథమికంగా నివేదిక అందజేశారు.

24 – 05 – 2020 : ఆదివారం
డీజీపీ కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలనే ఉద్దేశంతో  హైదరాబాద్‌ నుంచి డైరెక్టర్‌ వెంకట్‌ ఆధ్వర్యంలో పది మంది క్లూస్‌ టీం బృందాన్ని పంపించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన సిటీ క్లూస్‌ టీంతో పాటు ట్రెయినీ ఐపీఎస్‌ అధికారులు యోగేశ్‌ గౌతం, అఖిలేష్, రీజినల్‌  ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ భాస్కర్, పోలీస్‌ అధికారులు ఘటనా స్థలంలో మరిన్ని ఆధారాల కోసం అణువణువు అన్వేషించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ అన్వేషణ సాగింది.

సివిల్‌ పోలీస్‌ అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్, సైబర్‌ క్రైం, ఐటీకోర్, సీసీఎస్‌ టీం, క్లూస్‌టీం, హైదరాబాద్‌ సిటీ క్లూస్‌టీం, ఎస్‌బీ, ఇంటలిజెన్స్‌ విభాగం అధికారులు పలు కోణాల్లో కేసు మిస్టరీని ఛేదించడం కోసం కృషి చేశారు.

25 – 05 – 2020 : సోమవారం
నిందితుడు సంజయ్‌కుమార్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు. ఆ తర్వాత హత్యల వెనుక ఉన్న కారణాలను సీపీ వెల్లడించారు.

ఒక్కడే అంతా చేశాడా?
గీసుకొండ సమీపంలోని గొర్రెకుంట వద్ద తొమ్మిది మందిని హత్య చేసిన ఘటనలో నిందితుడు ఒక్కడేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంజయ్‌ ఒక్కడే తొమ్మిది మంది తినే ఆహారంలో నిద్రమాత్రలు కలపడం.. వారు మత్తులోకి జారుకున్నాక ఒక్కరొక్కరిని తీసుకొచ్చి బావిలో పడేయడం.. ఇదంతా తెల్లవారుజాము వరకు జరిగిందని చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. అయితే, పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని చెబుతుండడంతో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

పట్టించిన సీసీ కెమెరాలు
తొమ్మిది మంది మృతదేహాలు బావిలో తేలిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేరే రాష్ట్రం నుంచి పని కోసం వచ్చిన వారు కావడం.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు లేక తనువు చాలించారని తొలిరోజు ప్రచారం సాగింది. ఇంతలోనే వేరే కారణంగా ఉండొచ్చని తేలగా.. మరుసటి రోజు ఐదు మృతదేహాలు వెలుగు చూశాయి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు ఆరు బందాలను ఏర్పాటు చేశారు. గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఈ కేసులో కీలకంగా మారాయి. ఈ పుటేజీల్లో సంజయ్‌ సైకిల్‌పై వరుసగా ఐదు రోజులుగా వచ్చినట్లు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా తొమ్మిది హత్యలు చేసిన తీరుతో పాటు వీటన్నింటికీ కారణమైన రఫీకా హత్య వివరాలు వెల్లడించాడు. అలాగే, మక్సూద్‌ కుటుంబం వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులు కూడా కొంత మేర పరిశోధనలో ఉపయోగపడినట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top