గాల్లోనే పేలిపోయిన విమానం.. 71 మంది దుర్మరణం!

Russia flight crashed minutes after take off in Moscow - Sakshi

మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మాస్కోలోని డొమొడెడొవో విమానాశ్రయం నుంచి ఉరల్‌ పర్వతశ్రేణుల్లోని ఓర్క్స్‌ పట్టణానికి ఆదివారం బయలుదేరిన ఆంటొనోవ్‌ ఏఎన్‌–148 జెట్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కూప్పకూలిపోయింది. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 71 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఆరుగురు సిబ్బందితో పాటు 65 మంది ప్రయాణికులు ఉన్నట్లు రష్యా అత్యవసర విభాగం తెలిపింది. సరతోవ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం మాస్కోకు 80 కి.మీ ఆగ్నేయాన ఉన్న రామెన్‌స్కీ జిల్లాలోని అర్గునోవో గ్రామం సమీపంలో కూప్పకూలిపోయిందని వెల్లడించింది.

ఈ ప్రాంతంలో ఏఎన్‌–148 విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని పేర్కొంది. తీవ్రంగా మంచు కురుస్తుండటంతో దాదాపు 150 మంది సహాయక సిబ్బంది కాలినడకన ప్రమాదస్థలికి చేరుకుంటున్నారు. మరోవైపు విమానం గాల్లోనే కాలిపోతూ కుప్పకూలిపోవడాన్ని తాము చూసినట్లు పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదస్థలితో పాటు మంచులో చెల్లాచెదురుగా పడిపోయి ఉన్న విమాన శకలాల వీడియోను రష్యా ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్‌ అత్యవసర ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి కోరారని ఓ రష్యన్‌ వెబ్‌సైట్‌ తెలిపింది.

టేకాఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే..సరతోవ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆంటొనోవ్‌ ఏఎన్‌–148 టేకాఫ్‌ తీసుకున్న నాలుగు నిమిషాలకే విమానంతో రేడియో సంబంధాలు తెగిపోయాయని రష్యా ఏటీసీ అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2.21 గంటలకు బయలుదేరిన విమానం వెయ్యి మీటర్ల ఎత్తుకు చేరుకోగానే రామెన్‌స్కీ జిల్లా ప్రాంతంలో రాడార్‌ నుంచి అదృశ్యమైందన్నారు. ఏడాది క్రితం ఈ విమానాన్ని మరో సంస్థ నుంచి సరతోవ్‌ కొనుగోలు చేసిందన్నారు. విమానంలోని ఓ ఇంజిన్‌ పేలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నామన్నారు.

ప్రమాదం ప్రతికూల వాతావరణం కారణంగా జరిగిందా? లేక మానవ తప్పిదమా? అన్న అంశాలను పరిశీలిస్తామని రష్యా రవాణా మంత్రి మాగ్జిమ్‌ సొకొలొవ్‌ తెలిపారు. ఈ ప్రమాదంపై రష్యా విచారణ కమిటీ క్రిమినల్‌ విచారణను చేపట్టిందన్నారు. అర్గునోవో గ్రామం సమీపంలో విమాన శకలాలతో పాటు కొన్ని మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో చనిపోయినవారిలో 60 మంది తమ ప్రాంతానికి చెందినవారేనని ఓరెన్‌బర్గ్‌ గవర్నర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంతాపం తెలిపారు. కాలం చెల్లిన విమానాలను వినియోగిస్తుండటంతో రష్యాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top