చెన్నైలో చోరీచేసి  రైలులో పరార్‌

RPF solves gold heist case in quick time - Sakshi

విజయవాడలో నిందితులను పట్టుకున్న రైల్వే పోలీసులు

రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం

సాక్షి,విజయవాడ: చెన్నైలోని ఒక బంగారం వ్యాపారి ఇంట్లో రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను చోరీ చేసి పరారవుతున్న ఇద్దరు దొంగలను విజయవాడ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బంగారం, వెండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హంసరాజ్‌ సింగ్‌ (27), హరీంద్రసింగ్‌ (26) చెన్నైలో చోరీ చేసి రైలులో విజయవాడ వైపు పారిపోతున్నారని చెన్నై జాయింట్‌ కమిషనర్‌ నుంచి రైల్వే సీనియర్‌ డీఎస్పీ ఎస్‌ఆర్‌గాంధీకి మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఫోన్‌ ద్వారా సమాచారం వచ్చింది. దొంగల ఫోన్‌ను ట్రాకింగ్‌ చేయడం ద్వారా చెన్నై నుంచి వచ్చే మూడు రైళ్లలో దొంగలు వచ్చే అవకాశం ఉందని భావించారు. గూడూరులోని రైల్వే పోలీసులు తనిఖీలు చేసి 2 రైళ్లలో దొంగలు లేరని నిర్ధరించుకున్నారు. సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ (12651)లో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్నారు.

రంగంలోకి విజయవాడ ఆర్పీఎఫ్‌ పోలీసులు 
సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు చెన్నై బయలుదేరితే విజయవాడ వరకు ఆగదు. విజయవాడలో దొంగలు తప్పించుకునే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి రైలు తెనాలిలో కొన్ని క్షణాలు ఆపించి రైల్వే ఆర్‌పీఎఫ్‌ స్పెషల్‌ టీమ్‌ను రైలులోకి ఎక్కించారు. వీరు మూడు బృందాలుగా విడిపోయి ప్రతిబోగీని తనిఖీ చేశారు. చివరికి దొంగలను గుర్తించి రైలు విజయవాడకు చేరగానే అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5 కోట్ల విలువైన 13.5 కేజీల బంగారం, 67 కేజీల వెండి, 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి చెన్నై పోలీసులకు అప్పగించారు. దేశ రైల్వే చరిత్రలోనే అతి పెద్ద రికవరీల్లో ఇది ఒకటని అధికారులు చెబుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top