గన్‌ గ్యాంగ్‌

rowdy sheeters photos with cm and minister lokesh - Sakshi

రాజధానిలో రెచ్చిపోతున్న రౌడీమూకలు  

టీడీపీ పెద్దల అండే దన్ను  

హడలెత్తిస్తున్న రౌడీషీటర్‌ సుబ్బు వ్యవహారం

రాజధానిలో రౌడీయిజం బరితెగిస్తోంది. టీడీపీ పెద్దల అండదండలే దన్నుగా రౌడీమూకలు విశృంఖలత్వానికి దిగుతున్నాయి. దశాబ్దం క్రితం సద్దుమణిగిన రౌడీయిజానికి పాలకులు పాలుపోసి పెంచుతున్నారు. వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లే పంథాగా.. భూ సెటిల్‌మెంట్లే దందాగా.. రాజకీయ ప్రత్యర్థులే అంతిమ లక్ష్యంగా రౌడీయిజం వెర్రితలలు వేస్తోంది. కానీ, పోలీసులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఎందుకంటే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సాన్నిహిత్యం. టీడీపీ ప్రజాప్రతినిధుల ఆశ్రయం. తాజాగా హైదరాబాద్‌ పోలీసులు అక్రమ ఆయుధాల కొనుగోలు కేసును ఛేదించగా హత్యా రాజకీయాలకు బరితెగిస్తున్న రౌడీషీటర్లతో విజయవాడ టీడీపీ పెద్దల సంబంధాలు బయటపడ్డాయి.

సాక్షి, అమరావతి బ్యూరో : హైదరాబాద్‌ పోలీసులు శనివారం ఛేదించిన ఓ కేసు విజయవాడలో రౌడీయిజం, అందుకు టీడీపీ పెద్దల సహకారాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన పొట్లూరి ఈశ్వర్, తెల్లగోర్ల సునీల్‌కుమార్‌ను హైదరాబాద్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న వీరిద్దరూ విజయవాడకు చెందిన సుబ్బు అనే రౌడీషీటర్‌కు విక్రయించేందుకు బీహార్‌ నుంచి అక్రమంగా తుపాకులు తెప్పించారు. దీనిపై ఉప్పందడంతో పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేశారు. కాగా, అక్రమంగా తుపాకులు కొనుగోలుకు యత్నించిన విజయవాడకు చెందిన సుబ్బు ఎవరన్నది తెలుసుకునేందుకు యత్నించగా, మొత్తం వ్యవహారం బయటపడింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కాళిదాస్‌ సుబ్రహ్మణ్యం అలియాస్‌ వేమూరి సుబ్బు కొన్నేళ్లుగా విజయవాడలో ఉంటున్నాడు. అతను టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. ఏకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో కలిసి తిరిగేంత సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమాకు అనుచరుడిగా ఉన్నాడు.

నేరచరిత్ర..
సుబ్బు నేరచరిత్ర భీతిగొలిపేదిగా ఉంది. సుబ్బు పేరు మోసిన రౌడీషీటర్‌. గతంలో తెనాలిలో దాడులు, ప్రతిదాడుల్లో అతని పాత్ర ఉంది. సుబ్బు సోదరుడు కూడా హత్యకు గురయ్యాడు. తెనాలి పోలీసులు సుబ్బుపై జిల్లా బహిష్కరణ విధించగా, అతను విజయవాడకు మకాం మార్చాడు. అప్పటి నుంచి టీడీపీ నేతలకు సన్నిహితుడిగా ఉంటున్నాడు. గతంలో కాట్రగడ్డ బాబుకు అనుచరుడిగా వ్యవహరించాడు. అప్పట్లో వంగవీటి శంతన్‌కుమార్‌పై కాల్పుల జరిపింది సుబ్బు అని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో అతను నిందితుడు. అనంతరం సుబ్బును టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేరదీసినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఉమా తరఫున నగరంలో కీలక వ్యవహారాలన్నీ అతనే పర్యవేక్షిస్తాడని తెలుస్తోంది. ఈ క్రమంలో అతను చంద్రబాబు, లోకేష్‌కు కూడా సన్నిహితుడయ్యారు. దాంతో మూడేళ్లుగా సుబ్బు ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. పోలీసులు కూడా సుబ్బు        ఆగడాలపై ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. తాజాగా, సుబ్బు అక్రమ ఆయుధాలు సమకూర్చుకోవడానికి యత్నించడం రాజధానిలో కలకలం రేపుతోంది. ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఆయుధాలు సమకూర్చుకుంటున్నారో అన్నది చర్చనీయాంశంగా మారింది. సుబ్బు కోసం హైదరాబాద్‌ పోలీసులు శని, ఆదివారాల్లో విజయవాడ వచ్చారు. రాజకీయ ఒత్తిళ్లకు విజయవాడ పోలీసులు వారికి సహకరించలేదని సమాచారం.

రౌడీలే రౌడీలు
ఒక్క సుబ్బు వ్యవహారమే కాదు.. రాజధానిలో రెండేళ్లుగా రౌడీమూకల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. టీడీపీ పెద్దల అండతోనే వ్యూహాత్మకంగా రౌడీమూకలు నగరంలో విస్తరిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం విజయవాడలో 274 మంది రౌడీషీటర్లు, 130 మంది కేడీలు, 70మంది బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు ఉన్నారు. నలుగురు కరడుగట్టిన రౌడీషీటర్లను నగరం నుంచి బహిష్కరించారు. కానీ, ఈ రౌడీలంతా నగరంలో యథేచ్ఛగా దందాలు సాగిస్తూనే ఉన్నారు. నగర బహిష్కరణకు గురైన ఖల్నాయక్‌ అనే రౌడీషీటర్‌పై ఆరు నెలల్లో నాలుగు చార్జిషీట్లు నమోదయ్యాయి. నగర బహిష్కరణకు గురైన రౌడీ దర్జాగా ఎలా నగరంలో దందాలు సాగిస్తున్నాడో అనేది పోలీసులు పట్టించుకోలేదు. ఫలితంగా రెండు నెలల క్రితం ఖల్నాయక్‌ ఒకరిని హత్య చేశాడు.

గుంటూరు జిల్లాలో బహిష్కరణకు గురైన సుబ్బును టీడీపీ ప్రజాప్రతినిధి చేరదీశారు. రాజరాజేశ్వరిపేటలో ఆశ్రయం కల్పించారు. అక్కడి నుంచే దందాలు కొనసాగిస్తున్నాడు.
వ్యూహాత్మకంగానే రౌడీమూకలను విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో కేంద్రీకరిస్తున్నారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్లను కూడా ఇటీవల పాయకాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి మార్పించారు. వారిపై పోలీసుల పర్యవేక్షణ లేకుండా చేయడానికే ఓ ప్రజాప్రతినిధి ఇలా చేయించారు.
విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలో వ్యాపారులే లక్ష్యంగా దందాలు చేస్తున్నారు. రెండేళ్లలో ఏకంగా 50 వరకు దుకాణాలను బలవంతంగా ఖాళీ చేయించారు.
పాయకాపురం, కొత్త ఆర్‌ఆర్‌పేట, అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతాల్లో భూదందాలు, సెటిల్‌మెంట్లు, బలవంతపు వసూళ్లు, కాల్‌మనీ ఆడగాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు అజిత్‌సింగ్‌నగర్‌లో పర్యటించినప్పుడు మహిళలు రౌడీమూకల వేధింపులపై ఫిర్యాదు చేశారు.  ఫలితం లేకుండాపోయింది.  
ఆ ప్రజాప్రతినిధి చేరదీసిన రౌడీ గ్యాంగులే కొన్ని నెలల క్రితం ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ను కూడా హత్య చేశాయి.
విజయవాడలో కొన్ని నెలల క్రితం హవాలా దందాలో విభేదాలు వచ్చి ఓ వ్యాపారిని కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేశారు.
ఇటీవల ఓ మహిళా న్యాయవాదిపై హత్యాయత్నం కూడా ఈ గ్యాంగులపనే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top