దగ్గరకొస్తే కోసుకుంటా..!

Rowdy Sheeter Hulchul In front Of Chilakalaguda Police Station hyderabad - Sakshi

చిలకలగూడ ఠాణా ఎదుట రౌడీషీటర్‌ హల్‌చల్‌

బ్లేడుతో చేయి కోసుకుని వీరంగం

యువతిని నిర్భంధించి మూడు రోజులుగా లైంగికదాడి

చిలకలగూడ : చిలకలగూడ ఠాణా ఎదుట ఓ రౌడీషీటర్‌ హల్‌చల్‌ చేశాడు. మద్యం మత్తులో చేయి కోసుకుని రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. ఎట్టకేలకు అతడిని పట్టుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్, వారాసిగూడకు చెందిన షేక్‌అమీర్‌ రౌడీ షీటర్‌. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారాసిగూడకు చెందిన యువతి (19)ని ఆమె ఇంట్లోనే నిర్భంధించి గత మూడు రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అడ్డు చెప్పిన బాధితురాలి తల్లిపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని అతడి భారి నుంచి తప్పించడంతో ఆమె గురువారం రాత్రి చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేసింది. దీనిపై సమాచారం అందడంతో అమీర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.

నా పైనే ఫిర్యాదు చేస్తావా నిన్ను చంపేస్తా అంటూ బాధితురాలికి ఫోన్‌ చేసి బెదిరించాడు. ఈ క్రమంలో నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు శుక్రవారం అతడి బావను అదుపులోకి తీసుకున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం చిలకలగూడ ఠాణా వద్దకు వచ్చిన అమీర్‌ చేతిలో ఓ బ్లేడ్, నోటిలో మరో బ్లేడ్‌తో వీరంగం చేశాడు. పట్టుకునేందుకు ప్రయత్నించగా బ్లేడుతో చేతిని కోసుకున్నాడు. రక్తం కారుతున్నా లెక్క చేయకుండా ఠాణా పరిసరాల్లో పరుగులు పెట్టి భయాందోళనకు గురిచేశాడు. పట్టుకునేందుకు ప్రయత్నిస్తే గొంతు కోసుకుంటానని బెదిరించడంతో పోలీసులు వెనక్కితగ్గారు. దాదాపు రెండు గంటల పాటు హైడ్రామా కొనసాగింది. ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

పీడీ యాక్టు నమోదు చేసినా...
అమీర్‌ను పీడీ యాక్టుపై జైలుకు పంపినా అతని నైజంలో మార్పురాలేదు. హత్య, దోపిడీ, స్నాచింగ్, కొట్లాట కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్‌అమీర్‌పై చిలకలగూడ ఠాణాలో రౌడీషీట్‌ ఉంది. 2015లో అరెస్టై ఏడాది జైలుశిక్ష అనుభవించాడు. ఆ తర్వాత కూడా తన పాత పంథానే అనుసరిస్తున్నాడు. ఈ క్రమంలో వారాసిగూడకు చెందిన యువతి తనను అమీర్‌ నిర్భంధించి లైంగికదాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. వైద్యచికిత్సల అనంతరం బాధితురాలని భరోసా కేంద్రానికి పంపించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top