ఘరానా దొంగల ముఠా అరెస్ట్‌

Robbery Gang Arrest in Chittoor - Sakshi

రూ.3.21 లక్షలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం

క్రై ం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి వెల్లడి

చిత్తూరు, తిరుపతి క్రైం: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులతో కలసిపోయి బస్సు ఎక్కుతున్నట్టు నటిస్తూ  బంగారు ఆభరణాలు చోరీ చేసే ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.3.21లక్షల విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాలు...స్థానిక టీటీ డీ భూదేవి కాంప్లెక్స్‌ వద్ద అనుమానాస్పదంగా తచ్ఛాడుతున్న కర్ణాటక రాష్ట్రం గదక్‌ తాలూకాకు చెందిన ఎం.బేల (45), ముట్టుగారి రేణుక(55), అడల్‌ కార్తీక్‌ (20), సంతోష్‌ గైక్వాడ్‌(28), వాణిశ్రీ(50), ఓవీ సవిత(30), ముట్టుగారి నాగరాజు(21), అనూప్‌ (24), ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన నల్లపోతల మధును క్రైం సీఐ రసూల్‌ సాహెబ్‌ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.91లక్షల విలువ చేసే 97 గ్రాముల బంగారం, 30వేల నగదుతో పాటు నేరాలకు ఉపయోగించిన టాటా సుమోను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఇప్పటికే సీసీఎస్, ఈస్ట్‌ పీఎస్, తిరుచానూరులో ఒక్కొక్క కేసు నమోదై ఉన్నాయి. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్టు తేలింది. వీరు గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో పలు నేరాలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించారు.

భలే కిలాడీలు ఈ దొంగలు
ప్రయాణికుల వలే ఏదో ఒక వాహనాన్ని ఎంచుకుని వారు ముందుగా ఎంచుకున్న ప్రాంతానికి వస్తారు. గ్రూపులుగా విడిపోయి బస్సుల్లో, బస్టాండ్లలో, గుళ్లలో చోరీలకు పాల్పడుతుంటారు. వారం 10 రోజుల పాటు  దొంగతనాలు చేసి ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జంప్‌ అయ్యేవారు.  తిరుచానూరు గుడిలో నేరాలకు పాల్పడినప్పుడు సీసీ పుటేజీల ఆధారంగా ఈ ముఠాను గుర్తించారు. వారి కోసం గాలిస్తున్న తరుణంలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా భక్తుల రద్దీ ఉండే ఆలయాలు, ప్రయాణికుల తాకిడి ఉండే బస్టాండ్లనే టార్గెట్‌ చేసుకుని తమ హస్త లాఘవంతో ఆభరణాలు కొట్టేయడంలో ఈ ముఠా ఆరితేరిందని డీఎస్పీ చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top