ఏడుగురు కొడుకులు ఏడాదిన్నరకొకరు చొప్పున..! | Road Accident In Nizamabad Armoor Area | Sakshi
Sakshi News home page

ఏడుగురు కొడుకుల్లో ఏడాదిన్నరకొకరు మృత్యువాత!

Dec 20 2019 2:56 AM | Updated on Dec 20 2019 4:16 AM

Road Accident In Nizamabad Armoor Area - Sakshi

సాక్షి, ఆర్మూర్‌: విధి ఆ కుటుంబాన్ని చిన్నచూపు చూస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఏడుగురి సంతానంలో ఐదుగురు ఏడాదిన్నరకు ఒకరు చొప్పున అకాల మృత్యువాత పడ్డారు. ఏడుగురిలో ఇప్పటికే నలుగురు చనిపోగా, గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదో కుమారుడు ముజా హిదీన్‌ (22) మరణించాడు. కన్న కొడుకులు పాతిక సంవత్సరాల వయసు కూడా నిండకముందే ఒక్కొ క్కరుగా పిట్టల్లా రాలిపోవడంతో ఆ కన్నతల్లి కడుపుకోత వర్ణనాతీతంగా మారింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని శాస్త్రినగర్‌లో నివాసం ఉండే షేక్‌ అబ్దుల్‌ కరీం, రహీమున్సీసా బేగం దంపతులకు ఏడుగురు సంతానం. కాగా, బీడీ పొగాకు అమ్ముతూ కుటుంబాన్ని పోషించే ఇంటికి పెద్ద దిక్కు అయిన అబ్దుల్‌ కరీం 15 ఏళ్ల కింద అనారోగ్యంతో మృతి చెందడంతో బీడీలు చుట్టి తల్లి రహీమున్నీసా బేగం పిల్లలను పెంచి పెద్ద చేసింది.

ముగ్గురు కొడుకులు అనారోగ్యంతో మృతి చెందగా, ఇద్దరు కొడుకులు ప్రమాదాల బారిన పడి మరణించారు. అయితే మృతి చెందిన ఐదుగురు కూడా ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. షేక్‌ ఇర్ఫాన్‌ ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఇతడు 2011లో అనారోగ్యంతో మృతి చెందాడు. మరో ఏడాదిలోనే (2013లో) పెద్ద కుమారుడు షేక్‌ బాబా సైతం అనారోగ్యంతో మృతి చెందగా, అతడి భార్య, పిల్లలు అనాథలయ్యారు. నాలుగో కుమారుడు షేక్‌ మోబిన్‌ సైతం ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ 2015లో గూండ్ల చెరువులో స్నానం చేయడానికి దిగి ఈత రాక పోవడంతో మృత్యువాత పడ్డాడు.

మూడో కుమారుడు షేక్‌ అజ్జు 2017లో గుండెపోటుతో మృతి చెందడంతో అతడి భార్య, పిల్లలకు పెద్దదిక్కు లేకుండాపోయింది. ప్రస్తుతం ఐదో కుమారుడు ముజాహిద్‌ను మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. ఏడాదిన్నర వ్యత్యాసంతో ఒక్కొక్కరు మృత్యువాత పడుతుండటంతో 55 ఏళ్ల వృద్ధాప్యంలో తల్లి రహీమున్సీసాకు కడుపుకోతగా మారింది.  

Advertisement
 
Advertisement
Advertisement