పగలు డాక్టర్‌.. రాత్రిమో....స్మగ్లర్‌

Rmp Doctor Day Is Doctor Night Is Smuggler - Sakshi

ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

నిందితుల్లో ఆర్‌ఎంపీ డాక్టర్, ముగ్గురు ప్రొటెక్షన్‌ వాచర్లు

15 దుంగలు, 3వాహనాలుస్వాదీనం

రైల్వేకోడూరు అర్బన్‌ : సమాజంలో ఎంతో పవిత్రమైన వైద్యవృత్తిలో ఉంటూ.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఆర్‌ఎంపీ డాక్టర్‌  కాల్వ నాగేశ్వర్‌రావుతో పాటు మరి కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. రాజంపేట డీఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సీఐ సాయినాథ్‌ పర్యవేక్షణలో ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలంలు తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎంతోకాలంగా గుట్టుచప్పుడు కాకుండా డాక్టర్‌ ముసుగులో ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్న కాల్వ నాగేశ్వర్‌రావు, ప్రొటెక్షన్‌ వాచర్లు సుధాకర్, పరశురాం, శ్రీనులను కోడూరు మండలం కుక్కలదొడ్డికి చెందిన అంకయ్య, చిత్తూరు జిల్లా మామండూరుకు చెందిన గురవయ్యలను అరెస్ట్‌ చేసి 9,28,000 రూపాయలు విలువచేసే 15 ఎర్ర చందనం  దుంగలు, ఒక కారు, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లి అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందనే సమాచారంతో మూడు బృందాలుగా దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడులలో స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారన్నారు. వారిలో ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. విచారణలో వీరు తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాలకు చెందిన కొంతమంది స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని కూలీలను తీసుకువచ్చి వారిని అడవుల్లోకి తరలించి దుంగలు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

పాత నేరస్తుడితో సంబంధాలు

స్మగ్లింగ్‌ చేస్తున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ కాల్వ నాగేశ్వర్‌రావుకు పలు ఎర్రచందనం కేసులలో నిందితుడిగా ఉంటూ పరా రీలో ఉన్న స్మగ్లర్‌ భీమాతో సంబంధాలు ఉన్న విషయం పోలీసుల విచారణలో తెలిసినట్లు సమాచారం. స్మగ్లర్‌ భీమాపై సుమారు 9 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతానికి వస్తే అరెస్ట్‌ చేస్తారేమోనని  డాక్టర్‌ ద్వారా పనులు  చక్కబెడుతున్నట్లు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top