మాయచేస్తారు... నిండా ముంచేస్తారు...

rice pulling batch in vizianagaram - Sakshi

 మహిమల పేరుతో జనం జేబులకు చిల్లు

సీసాలు, చెంబులు, నాణేలకు రూ.లక్షలు

దేవుడి బొమ్మలనూ వదలని దుర్మార్గులు

పట్టుకుందామని ప్రయత్నిస్తే ఎదురు దాడులు

జిల్లాలో పెచ్చుమీరుతున్న పచ్చి మోసాలు

రూ.కోట్లల్లో జరుగుతున్న లావాదేవీలు

సీసా దగ్గరుంటే అదృష్టం వరిస్తుందట.. రాగి చెంబు ఇంట్లో పెట్టుకుంటే సిరులు నట్టింట్లో నాట్యం చేస్తాయట.. కాయిన్లు ఇస్తే లక్ష రూపాయలు మీవేనట.. అబ్బో ఇలా ఒకటేమిటి నమ్మాలేగానీ పచ్చగడ్డిని, బండ రాయిని కూడా అద్భత మూలికనో... అరుదైన శిల అనో... అంటగట్టేస్తారు. ప్రజల అమాయకత్వాన్ని... మూఢనమ్మకాన్ని... సొమ్ము చేసుకునే జనం ఎక్కువయ్యారు. నిరక్షరాస్యులే గాదు... అక్షరాస్యులు సైతం వీటిని గుర్తించలేక మోసగాళ్ల వలలో పడి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. రూ.కోట్లు, రూ.లక్షల్లో సొమ్ములు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. మోసగాళ్లను పట్టుకుందామని ప్రయత్నిస్తే పోలీసులనైనా ఎదిరిస్తున్నారు మరి.

సాక్షిప్రతినిధి, విజయనగరం: రామభద్రపురం కేంద్రంగా మహిమ గల రాగి చెంబు ఉందని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని బురిడీ కొట్టించి ఏకంగా రూ.1.13కోట్లు కొట్టేసిన వైనం జిల్లా వాసులను అవాక్కయ్యేలా చేసింది. ఆరు నెలల పాటు బొబ్బిలి, కొమరాడ, విశాఖపట్నంకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఇలా మహిమ గల మర చెంబు అంటూ జనాన్ని మాయ చేశారు. చివరికి బాధితుడి ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయారు. అల్లా ఉద్దీన్‌ అద్భుత దీపం లాంటి పురాతన సీసా మీ వద్ద ఉంటే మీరిక అదృష్టవంతులేనని నమ్మబలికే ముఠా పార్వతీపురం ఏజెన్సీలో తిరుగుతోంది. ఈ సీసాను రూ.లక్ష చెల్లించి జనం కొనుగోలు చేస్తున్నారు. పురాతన సీసాలు, మహిమ గల సీసాలు అంటూ కొన్ని ముఠాలు గ్రామాల్లో తిరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం ఇలాంటి వారిని పట్టుకుని కేసు నమోదు చేశారు.

దేవుడి పేరుతో...: సీతారామ లక్ష్మణులు, ఆం జనేయ స్వామి బొమ్మలుండే పాత రూపాయి వెండి, రాగి నాణేలు దొరికితే  రూ.లక్ష చెల్లిస్తామని నమ్మబలుకుతున్న కొన్ని ముఠాలు జిల్లాలో తిరుగుతున్నాయి. పార్వతీపురం, బొబ్బిలి, సా లూరు, ఎస్‌ కోట, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాల్లో ఈ తరహా ప్రచారాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పాత నాణెం వేటకు సంబంధిం చి జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముందుగా రూ.20 వేలిస్తామని, అనంతరం రూ.50 వేలనీ, ఆ తరువాత రూ.లక్ష ఇస్తామని ప్రచారం జోరుగా సాగిస్తారు. కొంద రు అమాయకులు రూ. లక్ష అంటున్నారు కదా నని ఎంతో కొంత లాభం వస్తుందని ఇతరుల వద్ద రూ.50వేల వరకూ కొనుగోలు చేసి అమ్మకానికి ప్రయత్నిస్తే కొంటామన్న వారు కనిపించట్లేదు. ఈ రకంగా అమాయకులు కొనుగోలు చేసిన ఆ నాణేలను కూడా ముఠా సభ్యులే ఏర్పా టు చేసి సొమ్ము ముట్టాక పరారవుతున్నారు. కొన్నేళ్ల కిందట కురుపాంలోని పురాతనమైన నీల కంఠేశ్వర స్వామి విగ్రహం చోరీఅయింది. మహిమ గల నాణేల కోసం కలియ తిరుగుతున్న వ్యక్తులే దీనిని అపహరించారని భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినా నేటికీ విగ్రహం లభ్యం కాలేదు.

రైస్‌ పుల్లింగ్‌ బ్యాచ్‌: బ్రిటిష్‌ కాలం నాటి రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ చాలా మంచిదని, ఆ కాయిన్‌ మన వద్ద ఉంటే ధనం నట్టింట తాండవిస్తుందని నమ్మబలికే ముఠా పోలీసులకు పట్టుబడ్డారు. 1847లో ముద్రించిన కాయిన్‌కు ఇరీడియం అనే మెటల్‌ ఉంటే  బియ్యాన్ని ఆకర్షిస్తుంది. ఈ తర హా నాణేన్ని తీసుకువచ్చి వారి ఎదురుగా బి య్యాన్ని ఉంచితే ఆ నాణెం ఆకర్షించడంతో పలు వురు నమ్మి పెద్ద ఎత్తున నమ్మకం కలిగి లక్షలు పోసి కొనుగోలు చేసేవారు. ఆ నేరం చేసి పట్టుబడ్డ 52 మంది మీద బైండోవర్‌ కేసులను  నమో దు చేశారు. గతేడాది మేలో రైస్‌పుల్లింగ్‌ కేసులో విశాఖకు చెందిన ఓ రైల్వే ఉద్యోగి సస్పెండయ్యా రు. అలాగే సాలూరుకు చెందిన ఇద్దరు, గుమ్మలక్ష్మీపురానికి చెందిన మరో ఇద్దరు అరెస్టయ్యారు. పార్వతీపురం, కురుపాంలో పాత నాణేల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
ఎస్సైనే నెట్టివేసిన ముఠా:  పార్వతీపురం వెంకంపేట గోరీల వద్ద సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా ఓ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా పాత నాణేల ముఠా సభ్యుడు దొరికాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్సై రాజేష్‌ ఆరు నెలల క్రితం మరో నిందితుడి కోసం బొండపల్లి వెళ్లగా నిందితులు బొలేరో వాహనంలో పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకోవడానికి వెళ్లిన ఎస్సైను నిందితులు నెట్టేయడంతో ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రత్యేక టీమ్‌ వేశాం: మహిమగల చెంబులు, కాయిన్లు, సీసాలు అంటూ ప్రజలను మోసం చేసే ముఠాలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. ఆ ముఠా సభ్యులను పట్టుకోవడానికి ఆరుగురు పోలీసులతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశాం. స్థానికులతో పాటు ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ముఠా సభ్యుల్లో విద్యాధికులు కూడా ఉంటున్నారు. రామభద్రపురం రాగిచెంబు గ్యాంగ్‌లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా ఉన్నాడు. ఇలాంటి వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ తరహా నేరాలపైనా అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. – ఎమ్‌.దీపికా పాటిల్, ఏఎస్పీ, పార్వతీపురం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top