నోటీసులివ్వగానే పరార్‌

Ravi Prakash Not Attended To Police Investigation After Notices issued - Sakshi

చట్టంలోని వెసులుబాటే వారికి ఆయుధం 

మత్తయ్య నుంచి రవిప్రకాశ్‌ దాకా ఇదే తీరు 

కొంతకాలానికి కేసు కోల్డ్‌ స్టోరీజీలోకి.. 

గత కేసులే ఇందుకు నిదర్శనం 

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు. ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు జారీ చేసినా, దాదాపు అందరూ పోలీసుల విచారణకు వెంటనే రాలేదు. రేపని.. మాపని.. ఆరోగ్యం బాగాలేదని.. అందుబాటులో లేమంటూ.. రకరకాల కారణాలు చెప్పి విచారణను వీలైనంత జాప్యం చేశారు. ఈలోగా కేసు గురించి అంతా మర్చిపోయారు. ఇది ఇలాంటి కేసుల్లో ఇరుక్కునే వారికి ప్రాథమిక పాఠంగా మారింది. విచారణను వీలైనంత జాప్యం చేస్తే.. కేసు గురించి అంతా మర్చిపోతారన్న సంకేతాలు బలంగా వెళ్లాయి. అది మొదలు.. ఇలాంటి కేసుల్లో చిక్కుకున్న వారెవరూ పోలీసు విచారణ అంటే పెద్దగా బెదిరిపోవడం లేదు. 

వెసులుబాటే ఆసరా.. 
ఓటుకు కోట్లు కేసులో నిందితుడు మత్తయ్య నుంచి ఫోర్జరీ కేసులో ఇరుక్కున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ వరకు అందరూ ఇదే పోకడ అనుసరిస్తుండటం గమనార్హం. విచిత్రంగా ఓటుకు కోట్లు, ఐటీ గ్రిడ్‌ డేటా చౌర్యం కేసులు ఆరంభంలో తీవ్ర సంచలనం రేపాయి. కానీ, కాలక్రమంలో రెండు కేసుల్లో ఇంత వరకూ పెద్దగా పురోగతి లేకపోవడం, నత్తకు తాతలా దర్యాప్తు సాగడం చర్చనీయాంశంగా మారింది. ఈ మూడు ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలే కావడంతో పోలీసులు నిబంధనల ప్రకారం.. సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేస్తున్నారు. వీటిని అందుకున్న నిందితులు కేసు దర్యాప్తును ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో విచారణకు డుమ్మా కొడుతున్నారు.

తెలంగాణలో ఉంటే పోలీసులు ఎలాగైనా అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారు. వీరంతా ఏపీకి వెళ్లడం, అక్కడి అధికార టీడీపీ నిందితులకు మద్దతు పలకడం విశేషం. ఒకవేళ తెలంగాణ పోలీసులు వెళ్లినా.. వారికి నిందితులను అరెస్టు చేయడం కష్టం అవుతుండటంతో ఈ కేసుల్లో విపరీతమైన జాప్యం నెలకొంటోంది. మత్తయ్య బాటలో ఏపీకి పారిపోయిన ఐటీ గ్రిడ్‌ అశోక్, రవిప్రకాశ్‌ ఆచూకీని ఇంతవరకూ పోలీసులు కనిపెట్టలేకపోయారు. వాస్తవానికి క్లిష్టమైన కేసుల చిక్కముడులు విప్పడంలో, వివిధ నేరాల్లో నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చేయడంలో రాష్ట్ర పోలీసులు అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటున్నారు. కానీ, ఈ మూడు కేసుల్లో మాత్రం దర్యాప్తు తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా సాగడం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top