చెలరేగిన మృగాళ్లు

rape attempt on degree student in kanigiri - Sakshi

నమ్మించి.. ఆపై వంచించి..

స్నేహితుడితో కలసి యువతిపై అత్యాచారయత్నం

వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టిన నిందితులు

ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

సాక్షి, కనిగిరి: స్నేహం ముసుగులో ఓ విద్యార్థినిపై యువకులు అత్యాచార యత్నం చేశారు. ప్రతిఘటిస్తున్నా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. కనిగిరిలో ఓ విద్యార్థిని బీఎస్సీ చదువుతోంది. ఆ యువతికి స్థానిక అగ్రహారానికి చెందిన కార్తీక్‌తో పరిచయం ఉంది. కార్తీక్‌ ఆమెతో మాట్లాడాలని పట్టణ శివారుల్లోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. తనతోపాటు తన మిత్రులు సాయి, పవన్‌ను కూడా రమ్మన్నాడు. వీరితోపాటు యువతి స్నేహితురాలు కూడా వచ్చింది.

స్నేహితులే కదా అని వచ్చిన యువతిపై కార్తీక్, సాయి మృగాళ్లలా రెచ్చిపోయారు. ఆమెపై సాయి అత్యాచార ప్రయత్నానికి ఒడిగట్టాడు. ఆ యువతి ప్రాధేయపడుతున్నా వినిపించుకోకుండా, ఏడుస్తున్నా కనికరించకుండా అమానుషంగా ప్రవర్తించాడు. దుస్తులు తీయమంటూ అనాగరికంగా వ్యవహరించాడు. తప్పించుకోవడానికి యువతి ప్రయత్నించినా ‘ఎక్కడికి పోతావు.. తన్నుతా.. చంపుతా.. ఇక్కడే చస్తావు’ అంటూ కార్తీక్‌ ఆమెను తీవ్రంగా హెచ్చరించాడు. పైగా సభ్య సమాజం తలదించుకునే రీతిలో దీన్నంతా కార్తీక్‌ వీడియో తీశాడు. యువతి స్నేహితురాలు కూడా వద్దని వారిస్తున్నా ఏ మాత్రం వినిపించుకోకుండా దారుణాతిదారుణంగా వ్యవహరించారు. 

వెలుగులోకి ఇలా.. 
వాస్తవానికి ఈ ఘటన గత నెలలో జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి కూడా పరువుతో కూడిన వ్యవహారం కావడంతో మౌనం దాల్చారు. ఇటీవల ఈ వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో పట్టణంలో కలకలం రేగింది. ఈ మేరకు బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో సాయి, కార్తీక్, పవన్‌లను అరెస్ట్‌ చేసినట్లు సీఐ మరవనేని సుబ్బారావు మంగళవారం వెల్లడించారు. సాయి ఏ1, కార్తీక్‌ను ఏ2, పవన్‌ను ఏ3 ముద్దాయిలుగా అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై సెక్షన్‌ 366, 354, 354బీ, 60, 60ఏ, 34, 376, 307 సెక్షన్ల కింద అత్యాచారయత్నం, అసభ్యకర ప్రయత్నం, బట్టలు ఊడదీయడం, చంపేందుకు ప్రయత్నించడంతోపాటు ఐటీ యాక్ట్‌ తదితర కేసులు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.  

ఎస్పీ సీరియస్‌..
విద్యార్థినిపై చిత్రీకరించిన వీడియో దృశ్యాలు మంగళవారం మీడియాలో రావడాన్ని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సీరియస్‌గా తీసుకున్నారు. ఘటన తీరుపై కనిగిరి సీఐతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముగ్గురు విద్యార్థుల నేర చరిత్ర.. కేసు నమోదు తదితర విషయాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top