హత్య కేసుల్లో బాబా రాంపాల్‌కు జీవితఖైదు

Rampal Sentenced To Life Imprisonment For Two Murders - Sakshi

చండీగఢ్‌ : రెండు హత్య కేసుల్లో దోషిగా తేలిన బాబా రాంపాల్‌కు హిసార్‌లోని సెషన్స్‌ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. రాంపాల్‌ అనుచరులు పదిహేను మందికి కూడా కోర్టు ఇదే శిక్ష విధించింది. మరో మహిళ హత్య కేసులో విధించే శిక్షను కోర్టు బుధవారం నిర్ధారించనుంది. బాబా రాంపాల్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో హిసార్‌ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హిసార్‌లో సత్‌లోక్‌ ఆశ్రమ్‌ను స్ధాపించిన 67 ఏళ్ల రాంపాల్‌ రెండు హత్యలు, ఇతర నేరాల్లో దోషిగా నిర్ధారణ అయ్యారు.

హిసార్‌ జిల్లా జైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయస్ధానంలో నాలుగేళ్ల పాటు విచారణ చేపట్టిన అనంతరం హిసార్‌ అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి డీఆర్‌ చాలియా తుది తీర్పు వెల్లడించారు. నవంబర్‌ 2014లో అరెస్ట్‌ అయినప్పటినుంచి రాంపాల్‌ ఆయన అనుచరులు జైలు జీవితం గడుపుతున్నారు. 2014 నవంబర్‌ 19న రాంపాల్‌, ఆయన అనుచరులపై బర్వాలా పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.

బర్వాలాలోని రాంపాల్‌ ఆశ్రమంలో బాబా, ఆయన అనుచరుల నిర్బంధంలో ఉన్న తమ భార్యలు హత్య గావించబడ్డారని వారి భర్తలు ఢిల్లీకి చెందిన శివపాల్‌, యూపీకి చెందిన సురేష్‌లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

భారీ భద్రత
డేరా బాబాను కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించిన క్రమంలో చెలరేగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని బాబా రాంపాల్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. హిసార్‌ జిల్లా అంతటా సెక్షన్‌ 144 విధించి 2000 మంది పోలీసులను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించామని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌ మీనా తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top