ఆది నుంచి నేరాల చరిత్రే

Rakesh Reddy Crimes Reveals Hyderabad Police in Jayram Case - Sakshi

వెలుగులోకి వస్తున్న జయరాం హత్య కేసులో

ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డి అక్రమాలు

ఎమ్మెల్యేల పేరు చెప్పుకొని దందాలు

తల్లిదండ్రులపై దాడి, చంపుతానని బెదిరింపు

కూకట్‌పల్లి, జీడిమెట్లలో కేసులు

జీడిమెట్ల/భాగ్యనగర్‌కాలనీ: ఆర్థిక లావాదేవీ నేపథ్యంలో హత్యకు గురైన జయరామ్‌ కేసులో రాకేష్‌రెడ్డి ప్రధాన నిందితుడని తేలడంతో కుత్బుల్లాపూర్‌లో కలకలం రేగింది. వివాదాస్పదుడిగా ముద్రపడిన రాకేష్‌ రెడ్డిపై గతంలో కూకట్‌పల్లి, జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. టీడీపీ నాయకుల వెంట తిరుగుతూ అటు ఏపీ సీఎం చంద్రబాబు, అతడి తనయుడు లోకేష్‌ పేర్లు చెప్పుకుని హైదరాబాద్‌లో పలు సెటిల్‌మెంట్లకు పాల్పడినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలకు టికెట్లు ఇప్పించడం మొదలు, ప్రచారంలో సైతం అన్నీ తానై వ్యవహరించాడు. కుత్బుల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభల్లో ఏపీ సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో రాకేష్‌రెడ్డిని పొగడడం విశేషం. 

తల్లిదండ్రులపైనే దాడి..
తమ కుమారుడు ఇంటికి రావడం లేదని రాకేష్‌రెడ్డి తల్లిదండ్రులు పద్మ, శ్రీనివాస్‌రెడ్డి  2017 ఫిబ్రవరిలో అతని స్నేహితుడు రాజేందర్‌రెడ్డికి ఫోన్‌ చేసి అడిగారు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన రాకేష్‌రెడ్డి తల్లిదండ్రులను అసభ్యంగా దూషించడమేగాక, దాడి చేయడంతో పాటు చంపుతానని బెదిరించాడు. దీంతో తమ కుమారుడి నుంచి తమకు ప్రాణహాని ఉందని  పద్మ, శ్రీనివాస్‌రెడ్డి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా 225/2017 నంబర్‌తో కేసు నమోదైంది. 

ఎమ్మెల్యే పేరు చెప్పుకుని....  
రాకేష్‌ రెడ్డి గతంలో కూకట్‌పల్లిలోనూ పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. చింతల్‌కు చెందిన చౌడవరం మహేష్‌ కుమార్‌తో కలిసి అతను కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరు చెప్పి సుమారు ఆరు ఇండస్ట్రీలు, గ్రీన్‌ బావార్చి హోటల్, వస్త్ర దుకాణాల్లో రూ. 12.55 లక్షలు వసూలు చేశాడు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనుచరుడిగా చెప్పుకుంటూ భాగ్యనగర్‌ కాలనీలోని గ్రీన్‌ బావార్చి రెస్టారెంట్‌ యజమానిని బెదిరించి రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు.  దీంతో ఎమ్మెల్యేకు సమీప బంధువైన రెస్టారెంట్‌ యజమాని భాస్కర్‌రావు కృష్ణారావుకు ఫోన్‌ చేసి ఈ విషయం తెలిపాడు. ఎమ్మెల్యే  సూచనమేరకు భాస్కర్‌రావు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని రాకేష్‌ రెడ్డిని  రిమాండ్‌కు తరలించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top