లంచం.. నిర్బంధం | Sakshi
Sakshi News home page

లంచం.. నిర్బంధం

Published Wed, May 1 2019 10:22 AM

Public Prosecutor Demands Bribery In Court Area - Sakshi

కర్ణాటక, తుమకూరు:   బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఏకంగా కోర్టు ఆవరణలోనే లంచం తీసుకుంటూ  ఏసీబీ అధికారులకు పట్టిబడ్డారు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలుకా న్యాయాలయం ఆవరణలో మంగళవారం చోటుచేసుకుంది. కేఇబీ ఇంజనీర్‌ గురుబసవ స్వామినుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పీపీ పూర్ణిమను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. 

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2015వ సంవత్సరంలో జిల్లాలో భారీగా వచ్చిన ఈదురు గాలులకు, వర్షాలకు కూలిపోయిన చెట్లు, కరెంట్‌ స్తంభాలను తొలగించడానికి అటవీ శాఖ, బెస్కాం అధికారులు పనులు చేపట్టారు. ఆ పనుల్లో వృద్ధుడు ఒకరు అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా గాయపడటం జరిగింది. దాంతో ఆయన కుటుంబసభ్యులు అటవీ శాఖ, బెస్కాం అధికారులపైన తిపటూరు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

రూ.40వేలకు ఒప్పందం  
ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా పనిచేయాలంటే సొమ్ము ముట్టజెప్పాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఉన్న పూర్ణిమా రూ. రూ.40 వేలను అటవీ, విద్యుత్‌ అధికారులను డిమాండు చేశారు. అందులో బాగంగా బెస్కాం ఇంజనీర్‌ గురుబసవ స్వామి ఇప్పటికే పూర్ణిమా బ్యాంకు ఖాతాలో రూ. 20 వేలను వేశారు. మిగిలిన రూ. 20 వేలను మంగళవారం కోర్టు ఆవరణలో పూర్ణిమాకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వచ్చి నగదుతో పాటు పూర్ణిమాను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆమె చిక్కమగళూరులో, కడూరులో విధులు నిర్వహించినప్పుడు కూడా అవినీతికి పాల్పడిన కేసులున్నట్లు అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement