లిఫ్ట్‌ ఇస్తానని నమ్మించి..

Psycho Attack On Students At Mahabubnagar - Sakshi

సాక్షి, మరికల్‌ (నారాయణపేట): బైక్‌లపై లిఫ్ట్‌ ఇస్తామని నమ్మబలికి..అనంతరం కిడ్నాప్‌ చేసేందుకు యత్నిస్తున్న సైకోలతో మండలంలో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల వారి నుంచి ఇద్దరు విద్యార్థులు తప్పించుకున్న సంఘటనలు మండలంలో కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వెంకటాపూర్‌కి చెందిన జి.రాకేష్‌ అనే విద్యార్థి మరికల్‌లోని ఓ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నాడు. ఈ నెల 14న కళాశాల వదిలిన తర్వాత బస్సులో వెళ్లి వెంకటాపూర్‌ స్టేజీ దగ్గర దిగగా.. అక్కడే కాపు కాచుకొని ఉన్న ఓ వ్యక్తి మోటర్‌ సైకిల్‌పై వచ్చి ఊర్లోకి వెళ్తున్నా.. లిఫ్ట్‌ ఇస్తా రమ్మంటూ బైక్‌పై ఎక్చించుకొని.. మాయమాటలు చెప్పి తన బైక్‌ను ముళ్లచెట్లలోకి తీసుకెళ్లాడు.

అక్కడ ఆ విద్యార్థి దుస్తులను విడిపించి కత్తి తీసి చంపేందుకు యత్నించాడు. రాకేష్‌ అరుపులు కేకలు వేస్తూ.. ఆ వ్యక్తి నుంచి బలవంతంగా తప్పించుకొని నగ్నంగా రోడ్డుపైకి పరుగులు పెట్టి ప్రాణాలను కాపాడుకున్నారు. ఇది గమనించిన పక్కనే ఉన్న రైతులు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యాడని రైతులు తెలిపారు. ఈ ఘటనతో విద్యార్థి భయాందోళనకు గురై కళాశాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటున్నాడు.

ఆర్నెళ్ల క్రితం మరో ఘటన
గత ఆర్నెళ్ల క్రితం సైతం మరికల్‌కు చెందిన కేశవ్‌ అనే విద్యార్థిని మరికల్‌ పెట్రోల్‌ బంకు దగ్గర బైక్‌పై ఎక్కించుకొని సంపత్‌ రైస్‌మిల్‌ పక్కన ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి దుస్తులను విడిపించి చంపేందుకు యత్నించాడు. దీంతో కేశవ్‌ ధైర్యం చేసి ఆ వ్యక్తిని కిందకు తొసి రైస్‌మిల్‌ ప్రహరీ దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. ఈ రెండు సంఘటనలు ఒకే విధంగా జరగడంతో ఇదంతా చేస్తుంది ఒక్కరేనా.. లేక పిల్లలను కిడ్నప్‌కు చేసే ముఠా ఉందా అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

మా దృష్టికి రాలేదు 
ఇద్దరు విద్యార్థులను సైకోలు ఎత్తుకెళ్లి హత్యకు యత్నించారన్న విషయంపై బాధితులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదు. అనుమానితులు ఎవరైనా గ్రామాల స్టేజీ దగ్గర కానీ, ఎక్కడైనా సరే బైక్‌లు ఎక్కమని అడిగితే విద్యార్థులు, బాలికలు ఎవరు కూడా ఎక్కరాదు. అలాంటి వ్యక్తులు ఎదుట పడితే పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాలి.       
 – జానకిరాంరెడ్డి, ఎస్‌ఐ, మరికల్‌
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top