మరో దారుణం: నిండు గర్భిణి బలి

Pregnant Woman Run Over By Reversing Car Near Delhi, Minor Driver Arrested - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: నిర్లక్ష్యానికి  భారీ మూల్యం చెల్లించిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మరి కొద్ది రోజుల్లో పండంటి పాపాయిని ఎత్తుకోవాల్సిన   ఓనిండు గర్భిణి (28)తీరని లోకాలకు తరలిపోయింది.  కార్‌ పార్కింగ్‌ సందర్భంగా అదుపు తప్పిన  కారు దంపతులమీదికి దూసుకు వచ్చింది. దీంతో ఎనిమిదినెలల గర్భవతి  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా , ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని  సెక్టార్ 18లో  ఈ దారుణం చోటు చేసుకుంది. 

నోయిడా పోలీస్ సర్కిల్ ఆఫీసర్ శ్వేతాంబర్ పాండే  అందించిన సమాచారం ప్రకారం ఓ మైనర్  పార్కింగ్ అటెండెంట్  నిర్వాకానికి నిండు గర్భిణీ అర్థాంతరంగా అసువులు పాసింది.  నోయిడాలో నివసిస్తున్న బాధిత భారాభర్తలు మార్కెట్‌కు వచ్చారు.  అక్కడ పార్కింగ్‌ డ్యూటీలో ఉన్న మైనర్‌ బాలుడు(14) హోండా కారును పార్కింగ్ నుంచి బయటకు తీస్తూ.. రివర్స్‌ చేసే  క్రమంలో  వేగాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో  హోండా సిటీ కారు దంపతుల బైక్‌ను ఢీకొట్టి అనంతరం మరో రెండు కార్లపై దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన సమీపంలోని కైలాష్ ఆసుపత్రికి తరలించినా  అప్పటికే  మహిళ మరణించినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. పార్కింగ్ అటెండెంట్‌ను అదుపులోకి తీసుకున్నామని దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారి వెల్లడించారు. 

Back to Top