వైద్యుల నిర్లక్ష్యానికి గర్భిణి మృతి | Pregnant Woman Died | Doctor Negligence in Nalgonda | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యానికి గర్భిణి మృతి

May 6 2018 9:37 AM | Updated on Aug 29 2018 4:18 PM

Pregnant Woman Died | Doctor Negligence in Nalgonda - Sakshi

సవిత మృతదేహం

చౌటుప్పల్‌ (మునుగోడు) : పదిహేను గంటల పాటు ఆస్పత్రిలో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాక హడావుడి చేశారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో గుండెపోటు వచ్చింది. చివరి దశలో ఆసుపత్రి సిబ్బంది వచ్చి చెప్పగా డ్యూటీ డాక్టర్‌ పరీక్షించి ఈసీజీ తీయిం చింది. అప్పటికే గర్భిణి మృతిచెందింది. ఈ సంఘటన శనివారం నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నకొండూరు గ్రామానికి చెందిన చెక్క లింగస్వామి స్థానికంగా సీఆర్పీగా పనిచేస్తున్నాడు.

ఆయన భార్య సవిత(28)కి నెలలు నిండడంతో శుక్రవారం సాయంత్రం నుంచి నొప్పులు రావడం మొదలయ్యాయి. వెంటనే హుటాహుటిన ఆటోలో చౌటుప్పల్‌ ఆస్పత్రికి తరలించారు. పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఓ పరిశ్రమలో సవిత ఉద్యోగం చేస్తుండడంతో వీరికి ఈఎస్‌ఐ కార్డు ఉంది. గర్భం దాల్చినప్పటి నుంచి నాచారంలోని ఈఎస్‌ఐ, మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు పొందేది. ప్రసవ నొప్పులు వస్తుంటే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆరేళ్ల క్రితం మొదటి కాన్పు సాధారణంగా జరగడంతో కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా అదే భరోసాతో ఉన్నారు.

మృతదేహంతో ఆసుపత్రి వద్ద ఆందోళన..

సవిత కుటుంబ సభ్యులు అక్కడి నుంచి నేరుగా మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. కుటుంబసభ్యుల ద్వారా విషయం తెలసుకున్న గ్రామస్తులు, బంధువులు, మిత్రులు పెద్దఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. డీసీహెచ్‌ కోట్యానాయక్, ఆర్డఓ సూరజ్‌కుమార్, తహసీల్దార్‌ షేక్‌ అహ్మద్, సీఐ వెంకటయ్య వైద్యులు, భాదితులతో చర్చలు జరిపారు.  పూర్తిగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

ఏడుగురు సభ్యులతో కలిపి కమిటీ వేస్తామని, ఆ కమిటీ పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించి వాస్తవాలను వెలికి తీస్తామని చెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సవిత అదే గ్రామానికి చెందిన లింగస్వామిని ఏడేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో కెమిస్ట్‌గా పనిచేస్తోంది. వీరికి కూతురు గ్రేసీ(6) ఉంది.

కాగా తన భార్యను డాక్టర్లే చంపారని లింగస్వామి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. కాగా ఈ ఘటనలో తమ తప్పిదం ఏమాత్రం లేదని సవితను పరీక్షించిన వైద్యురాలు శ్వేత ప్రియాంక తెలిపారు. గుండెపోటు రావడంతోనే చనిపోయిందని చెప్పారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని అన్నారు. 

తేలికగా తీసుకున్న వైద్యులు..

శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆస్పత్రికి వెళ్లిన సవితను డ్యూటీలో ఉన్న వైద్యులు పరీక్షిం చారు. కడుపులో బిడ్డ నాలుగు కిలోల బరువు ఉందని, ప్రసవానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. భరించలేని నొప్పులు వస్తున్నాయ ని సవిత చెప్పినా అవి సాధారణమైన నొప్పులేనన్నారు. మళ్లీ నొప్పులు వచ్చినప్పుడు ఆస్పత్రి కి రావాలని సూచించి ఇంటికి వెళ్లమన్నా రు. డాక్టర్ల మాటలను పట్టించుకోని సవిత తన నొప్పుల బాధను కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ సమయంలో ఇంటికి వెళితే రాత్రివేళ ఆస్పత్రికి రావడం కష్టమని భావించిన వారు అక్కడే ఉండిపోయారు. నొ ప్పులు తగ్గకపోవడంతో డ్యూటీలో ఉన్న సిబ్బందిని కలిసి విషయాన్ని చెప్పారు. వారు కూడా చాలా తేలికగా తీసుకున్నారు. ఇలా తెల్లవారినా ఏమాత్రం మార్పురాలేదు. 

పరిస్థితి విషమించాక హడావుడి..

రాత్రి నుంచి పట్టించుకోని వైద్యులు, సిబ్బంది చివరకు పరిస్థితి పూర్తిగా విషమించాక హడావుడి చేశారు. పరిస్థితి తీవ్రతను మృతురాలి భర్త ఆస్పత్రిలో పనిచేసే తన తెలిసిన వ్యక్తికి చెప్పి పరిష్కారం చూపాలని వేడుకున్నాడు. సవిత పడుతున్న ఇబ్బందిని గమనించిన ఆ వ్యక్తి వెంటనే విషయాన్ని డ్యూటీలో ఉన్న వైద్యురాలు శ్వేతప్రియాంకకు చెప్పగా ఓపీలో ఉన్న ఆమె వచ్చి చూసింది. అంతకుముందు ఎంత బతిమిలాడినా పట్టించుకోని ఆమె తమ సిబ్బంది చెప్పగానే వచ్చింది.

ఇంతలోనే సవితకు గుండెపోటు వచ్చింది. గమనించిన వైద్యులు వెంటనే ఈసీజీ తీశారు. మరిన్ని పరీక్షల పేరుతో హడావుడి చేశారు. చివరకు హైదరాబాద్‌కు తరలించాలని చెప్పారు. వెంటనే భర్తతో సంతకం చేయించుకుని అంబులెన్స్‌లో పంపించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని చెప్పారు.

1
1/1

ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న సీఐ వెంకటయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement