గర్భంతో ఉన్న పిల్లిని చిత్రహింసలు పెట్టి..

Pregnant Cat Hanged Death At Army Veteran's Home In Kerala - Sakshi

తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ఆర్మీ అధికారి ఇంట్లో గర్భిణీ పిల్లి ఉరేసుకున్నట్లుగా కనిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ ఆర్మీ అధికారి పెరట్లో ఉన్న షెడ్డును క్లబ్‌లా వాడుకుంటున్నారు. ఈ క్రమంలో నవంబర్‌ 10న షెడ్‌లోకి పిల్లి రావటంతో క్లబ్‌ సభ్యుల్లోని ఒకరు దాన్ని తాడుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి చంపారు. అనంతరం కాంపౌండ్‌ గోడకు ఉన్న తాడుపై పిల్లిని వేలాడదీశారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పొరుగింటివాళ్లు ఘటన గురించి జంతు సంరక్షణాధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే అధికారిణి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కాగా అప్పటికే క్లబ్‌ సభ్యులు పిల్లిని మట్టిలో పాతిపెట్టడానికి ప్రయత్నిస్తుండగా.. అక్కడున్న వారితో పాటు ఆర్మీ అధికారి సైతం కేసు నమోదు చేయకుండా అధికారులను అడ్డుకున్నారు. ఇక ఈ అమానుష ఘటనపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాశవిక చర్యకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పార్వతీ మోహన్‌(భారతీయ జంతు సంరక్షణా సంస్థ ప్రచార సమన్వయకర్త), లత ఇందిరా (పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ కార్యదర్శి) పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఓ డాక్టర్‌ కుక్కపైకి తుపాకీ గురిపెట్టి కాల్చి చంపాడని... ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నా కఠిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు అంటూ వారు ఆవేదన ‍వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. పిల్లి పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top