పోయిందా..గోవిందా!

Prakasam Police Failed in Recovery Money And Gold - Sakshi

పోలీసులకు సవాల్‌గా మారుతున్న రికవరీలు

కొంత నేరగాళ్లతో ఖాకీలకు తలనొప్పి

సెల్‌ఫోన్లు పోతే అంతే సంగతులు

నిఘా నామ మాత్రమే

ప్రకాశం, చీరాల: ఎటువంటి గజదొంగలు.. అంతర్‌ రాష్ట్ర గజదొంగలను ఇట్టే పట్టేసిన ఘనత చీరాల పోలీసులది. ఇతర ప్రాంతాల్లో చోరీలు జరిగితే చీరాల పోలీసులను దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా నియమించిన దాఖలాలు కూడా గతంలో ఉండేవి. మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో ఉన్న అంతర్‌ రాష్ట్ర గజదొంగలను పట్టుకుని రికవరీలు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ట్రాఫిక్‌ సమస్య.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. వివిధ రకాల బందోబస్తులతోనే పోలీసులు సమయం సరిపోతోంది. అంతిమంగా చోరీ కేసుల్లో ముందడుగు వేయలేకపోతున్నారు. దొంగల పీచమణిచి వారి ఆటకట్టించే సాహసం చేయలేకపోతున్నారు. కొత్తగా వచ్చిన సిబ్బంది నేరగాళ్లు, దొంగల ముఠాలోని విద్యార్థులు, ఇతర వ్యక్తుల సమాచారం సేకరించలేక పోతున్నారు. అంతిమంగా దొంగలు పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. సరికొత్త పంథాలో చోరీలకు పాల్పడుతుండటంతో ఏ రకం చోరీ ఎవరు చేస్తున్నారో పసికట్టలేక పోతోంది నిఘా వ్యవస్థ. స్థానిక పోలీసులతో పాటు స్పెషల్‌ క్రైం బ్రాంచ్‌ (సీసీఎస్‌) ఉన్నా పెద్దగా ఫలితాలు మాత్రం రావడం లేదు. చోరీలు జరిగి ఏళ్లు గడుస్తున్నా రికవరీలు మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. చీరాల ప్రాంతంలో పది నెలలుగా అనేక చోరీలు జరిగాయి. చిన్నా చితక కేసుల్లో మినహా భారీ చోరీ కేసుల్లో నేరగాళ్లను పట్టుకుని చోరీ చేసిన సొత్తును రికవరీ చేయలేకపోతున్నారు. అనధికార ఐడీ పార్టీ ఆటలాడుకోవడం, నిఘా వ్యవస్థ నిద్రపోవడం లాంటివి జరుగుతుండటంతో పాత నేరగాళ్ల కదలికలపై నిఘా ఉండటం లేదు. 

ఛేదించని కేసులెన్నో..
ఇటీవల చినగంజాంకు చెందిన వృద్ధురాలు గుంటూరు నుంచి చీరాలకు వచ్చి స్థానిక కూరగాయల మార్కెట్‌ వద్ద ఆటో ఎక్కి పది నిమిషాలు ప్రయాణించిందో లేదో విలువైన బ్యాగును ఆటోలోనే కొట్టేశారు. ఆటోలో వృద్ధురాలు పక్కన కూర్చున్న ఓ మహిళ బ్యాగును అపహరించింది. ఆ బ్యాగులో 40 సవర్లు బంగారం, రెండు లక్షల రూపాయల నగదు ఉంది. సుమారు పది రోజులు క్రితం చోరీ జరిగింది. సాల్మన్‌ సెంటర్‌ వద్ద కిరాణా షాపు నడిపే ఓ వ్యక్తి ఇంట్లో ఏడాన్నర క్రితం 40 సవర్ల బంగారం, నగదు అపహరణకు గురైంది. గత మే 30వ తేదీన స్థానిక హరిప్రసాద్‌ నగర్‌ ఆర్‌కే ఓరియంటల్‌ స్కూల్‌ వద్ద నివాసం ఉండే రిటూర్డు ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడి రూ.రెండు లక్షల నగదు, బంగారం చోరీ చేశారు. ఏడాది క్రితం పందిళ్లపల్లిలో ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు నివాసంలో రూ.60 లక్షల విలువైన బంగారం, వెండిని అపహరించారు. రెండేళ్ల క్రితం సురేష్‌ మహాల్‌ వద్ద ఉన్న హారిస్‌పేటలో పులిపాక ఫాతిమా ఇంట్లో అందరూ నిద్రిస్తుండగానే ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు దర్జాగా బీరువా తాళాలు తెరచి బీరువాలో ఉన్న రూ.74,000 నగదు, 12 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. గత నెల 27 తేదీన ఐఎల్‌టీడీ కంపెనీ వద్ద ఐఎల్‌టీడీ వర్కర్స్‌ సొసైటీ కార్యాయలంలో దొంగలు తెగబడి కార్యాలయం వెనుక తలుపులు బద్దలు కొట్టి బీరువాలో దాచి ఉంచిన రూ.1.85 లక్షల నగదు అపహరించారు. అలాగే శాంతి నగర్‌కు చెందిన కొలిశెట్టి హనుమంతురావు కుటుంబ సభ్యులు తిరుపతి దైవదర్శనానికి వెళ్లగా బీరువాలో దాచుకున్న 20 సవర్ల బంగారు ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు..

టూటౌన్‌ పరిధిలో..
టూటౌన్‌ పరిధిలో కొత్తపేట శ్రీనివాస పురంలో గతేడాది ఐదో నెలలో జరిగిన చోరీ ఘటనలో లక్ష సొత్తు అపహరించారు. సంపత్‌నగర్‌ బైపాస్‌ రోడ్డులో పోలీసుల పేరుతో యువకులు దారికాచి ఓ వ్యక్తి వద్ద సెల్‌ఫోన్‌తో పాటు నగదును అపహరించారు. గతేడాది ఉజిలిపేటలో 90 వేల విలువైన గేదెలు అపహరించారు. పేరాల అన్నదాత వారి వీధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడి ఒక ల్యాప్‌టాప్‌తో పాటు రూ.27 వేల నగదు అపహరించారు. వాడరేవు బజారులో ఓ వ్యక్తి తన స్కూటీలో 1,40,000 నగదు పెట్టుకోగా దొంగలు స్కూటీతో పాటు నగదు అపహరించారు. మొత్తం 13 కేసులకుగాను రికవరీ చేసింది కేవలం నాలుగు కేసులు  మాత్రమే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన చోరీ కేసులు 13 కాగా రికవరీ చేసింది నాలుగు కేసుల్లో మాత్రమే. మిగిలిన కేసుల్లో రికవరీలు శూన్యం.

సెల్‌ఫోన్‌ పోతే నో కేసు
ఇటీవల కాలంలో సెల్‌ఫోన్‌ చోరీలు ఎక్కువగా జరగుతున్నాయి. సెల్‌ఫోన్లను దొంగలు సాఫ్ట్‌వేర్‌లు మార్పించుకుని సాఫ్ట్‌గా వాడుకొంటున్నారు. వాటిని తక్కువ ధరకు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. సెల్‌ఫోన్‌లు పోయిన బాధితులు పోలీసుస్టేషన్లకు వెళ్లి కేసు పెడదామంటే పోలీసులు కేసులు తీసుకోవడం లేదు.. నమోదు చేయడంలేదు. ఏం చేయాలో తెలియక బాధితులు తలలు పట్టుకుంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top