అందని పోస్ట్‌మార్టం రిపోర్టు

Postmortem Report Delayed In Family Fire Accident Death Case - Sakshi

48గంటలు గడిచినా కొలిక్కిరాని రాజులకండ్రిగ కేసు

నివేదిక వస్తేగాని ఏమీ చేయలేమంటున్న పోలీసులు

అప్పుల వేధింపులే ఆత్మహత్యకు కారణమా..?

చిత్తూరు, శ్రీకాళహస్తి : ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమై 48గంటలు గడిచినా పోస్ట్‌మార్టం నివేదిక రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నివేదిక ఎందుకు ఆలస్యమవుతుందో ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. రిపోర్ట్‌ వస్తేగాని కేసును వేగవంతం చేయలేమని పోలీసులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్ల పురెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆయన భార్య బుజ్జమ్మ, బిడ్డలు భవ్య, నిఖిల్‌ ఎందుకు చనిపోయారో అంతుపట్టక అటు కుటుంబ సభ్యులు, ఇటు గ్రామస్తులు తలలు పట్టుకుంటున్నారు. అప్పుల బాధతో మృతి చెందారా లేదా గీజర్‌ గ్యాస్‌ లీకై ఏర్పడిన ప్రమాదంతో చనిపోయారా..లేదా మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది మిస్టరీగా మారింది. ఘటనకు రెండు రోజుల క్రితం మనవరాలు భవ్య తమ తాత బలరామరాజుకు ఫోన్‌ చేసి ‘తాతయ్య నాకు చాలా భయంగా ఉంది... నాన్న చనిపోదామని చెబుతున్నారు’ అంటూ రోదించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

కుమార్తె బుజ్జమ్మ కూడా తండ్రితో అదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అప్పుల వేధింపులతోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి పాపానాయుడుపేటలో చిన్నపాటి అద్దె గదిలో కాపురం ఉండేవాడు. పెద్ద మొత్తంలో చీటీలు వేసి, వాటిని ముందే పాడేసి ఆ డబ్బుతో ఇంటిస్థలం కొనుగోలు చేయడమేగాక ఇల్లు కట్టడానికి పెద్దమొత్తంలో అప్పులు చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఆటో ద్వారా వచ్చే ఆదా యం తగ్గిపోవడంతో ప్రతినెలా చీటీలకు నగదు చెల్లించలేకపోయాడని, ఈ క్రమంలో కొత్త అప్పులు చేసేవాడని చెబుతున్నారు. కొందరు తమ బాకీలు వెంటనే చెల్లించాలని పట్టుపట్టడంతో దిక్కుతోచని స్థితిలో శ్రీనివాసులురెడ్డి సక్రమంగా ఇంటికి రావడం మానేశాడని... వచ్చినా ముభా వంగా ఉండేవాడని అంటున్నారు. ఈ క్రమంలోనే భార్యాబిడ్డలు భయంతో బలరామరాజుకు సమాచారం ఇచ్చారని చర్చించుకుంటున్నారు. అప్పుల బాధ భరించలేక శ్రీనివాసులురెడ్డి గీజర్‌ గ్యాస్‌ పైపుల లీకేజీతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అధికారులు నివేదికలు అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌కు అందజేయనున్నారు. దాంతో వాస్తవాలు వెలుగుచూడనున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు శ్రీనివాసులురెడ్డి ఇంటికి తాళం వేసి ఉంచారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top