బాబాయ్‌.. అబ్బాయ్‌! 

Police Busts cricket Betting Gang in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వారిద్దరూ బాబాయ్, అబ్బా యిలు... ఒకరు రాజు పిట్టి, మరొకరు ప్రీతీష్‌ పిట్టి... ఇద్దరి స్వస్థలం కాచిగూడ ప్రాంతమే... రాజధానిలో ఉన్న బెట్టింగ్‌ రారాజుల్లో వీరిది ప్రత్యేక స్థానం. 2007లో వెలుగులోకి వచ్చిన నకిలీ పాస్‌పోర్ట్‌ కుంభకోణంతో రాజు పిట్టి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. ఈ కేసులో రాజు పిట్టి కీలక నిందితుడు. తాజాగా సోమవారం ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసిన హైటెక్‌ బెట్టింగ్‌ గ్యాంగ్స్‌లో ప్రీతీష్‌ పిట్టి ఉన్నాడు. రాజుపిట్టి... మనుషుల అక్రమ రవాణా, నకిలీ పాస్‌పోర్టుల కేసులో కీలక నిందితుడు. 2007లో ఈ కేసు వెలుగులోకి రావడంతో కొందరు నేతల రాజకీయ పునాదులు కదిలాయి. గుజరాత్‌కు చెందిన రాజుపిట్టి తండ్రి పన్నాలాల్‌ పిట్టి మధ్యస్థాయి వ్యాపారవేత్త. ఇతని సోదరులిద్దరూ నగరంలో పారిశుధ్య కాంట్రాక్టర్లు. వీరిలో వినోద్‌ పిట్టి ఒకరు. ఈయన కుమారుడే ప్రీతీష్‌ పిట్టి. ప్రస్తుతం సన్‌ సిటీలో ఉంటున్న అతడి వృత్తి శానిటరీ వ్యాపారమైనా ప్రవృత్తి మాత్రం బుకీ వ్యవహారం. రాజు పిట్టి సైతం 2000–2001లో బషీర్‌బాగ్‌కి చెందిన యోగేష్‌కుమార్‌తో కలిసి బుకీగా మారాడు. ఈ కుటుంబానికి సంబంధించి వినోద్, రాజు, ప్రీతీష్‌ ముగ్గురూ రాజధానిలోని బుకీల్లో ప్రముఖులు. వీరిపై కాచిగూడతో పాటు ఇతర పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి.   

రాజు ఇలా ఫేమస్‌... 
2005లో రాజుపిట్టికి రషీద్‌తో స్నేహం ఏర్పడంటంతో రషీద్‌కు అవసరమైన సొమ్మును రాజు వడ్డీకిచ్చేవాడు. ఈ నేపథ్యంలో రషీద్‌ మనుషుల అక్రమ రవాణా వ్యవహారాన్ని పిట్టికి చెప్పాడు. అదే ఏడాది జనవరిలో గుజరాత్‌లోని కల్లోల్‌ ప్రాంతానికి చెందిన భరత్‌భాయ్‌ని పిట్టి కలుసుకున్నాడు. అనంతరం వారితో కలిసి నకిలీ పాస్‌పోర్ట్స్‌ తయారీ ప్రారంభించాడు. వీరు అనేక మంది గుజరాతీయులను ప్రముఖ రాజకీయ నాయకుల బంధువులు, కుటుంబ సభ్యులుగా చెబుతూ నకిలీ పాస్‌పోర్టులు ఇప్పించే వారు. ఇందుకుగాను సదరు నేతలకు భారీగానే ముట్టజెప్పేవారు.  2006 నవంబర్‌లో రషీద్‌ నుంచి రాజుపిట్టికి ఓ సందేశం అందింది. నేరెళ్ల, బోథ్‌ నియోజకవర్గాలకు చెందిన కాసిపేట లింగయ్య, సోయం బాబూరావు తమకు సహకరించేందుకు సమ్మతించారన్నది దాని సారాంశం. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ వ్యవహారం 2007 మేలో ఢిల్లీలో బాబూభాయ్‌ కటారా, నగరంలో లింగయ్య, బాబూరావు అరెస్టుతో సంచలనం రేపింది. తరువాత రషీద్, మహ్మద్‌ ముజఫర్‌ అలీఖాన్, భరత్‌భాయ్‌ పట్టుబడ్డారు. 2008 ఆగస్టు 23న రాజుపిట్టి సైతం కటకటాల్లోకి వెళ్లాడు. మరోపక్క 2011 వరకు ప్రధాన బుకీగా ఉన్న ప్రీతీష్‌ పిట్టి ఆపై సబ్‌–బుకీగా, ఏజెంట్‌గా మారిపోయాడు.  

కొడుకు అక్కడ... తండ్రి ఇక్కడ... 
ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం గుట్టురట్టు చేసిన బెట్టింగ్‌ ముఠాల్లో తండ్రీ కొడుకులు ఉన్నారు. ఈ ముఠాలు ఉత్తరాదిలో డెన్స్‌ ఏర్పాటు చేసుకున్న ప్రధాన బుకీల ఆదేశాల మేరకు పని చేశాయి. మంగళ్‌హాట్‌కు చెందిన తండ్రీ కొడుకులు ముఖేష్‌ సింగ్, ప్రకాష్‌ సింగ్‌ల పం«థా వేరు. గోవా కేంద్రంగా ప్రకాష్‌ సింగ్‌ డెన్‌ ఏర్పాటు చేసుకుని కథ నడిపిస్తుండగా... నగరంలో ముఖేష్‌ సబ్‌–బుకీగా మారి ఇతర వ్యవహారాలు చూసుకునేవాడు. ప్రస్తుతం తండ్రి ముఖేష్‌తో పాటు ఇతడికి సహకరించిన శ్రీనివాస్, కునాల్‌సింగ్, సుర్జీత్‌ సింగ్‌ చిక్కగా... ప్రకాష్‌ పరారీలో ఉన్నాడు. 

బెట్టింగ్స్‌తో నష్టాలే ఎక్కువ 
క్రికెట్‌ సీజన్‌లో కష్టార్జితాన్ని బెట్టింగ్స్‌లో పెట్టి నష్టపోవద్దు. ఈ దందాలో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. సోమవారం చిక్కిన ముఠాల వద్ద పందెం కాసిన ఓ పంటర్‌ రూ.7 లక్షలు నష్టపోయి రూ.లక్ష మాత్రం సంపాదించాడు. తల్లిదండ్రులు, పెద్దలు యువతపై కన్నేసి ఉంచాలి. పందాలు కాసి షార్ట్‌కట్‌లో ధనవంతులు కావాలని భావిస్తే ఇబ్బందులు రావడంతో పాటు కొన్నిసార్లు జైలుకు సైతం వెళ్లాల్సి వస్తుంది. 
అంజినీ కుమార్, నగర కొత్వాల్‌  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top