జాగృతి జాడెక్కడ..!

Police Attack on Belt Shops in Vizianagaram - Sakshi

ప్రతి శనివారం నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలకు చెల్లు చీటీ

విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్ట్‌ షాపులు, సారా బట్టీలు

విజయనగరం రూరల్‌:  ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ‘జాగృతి’ కార్యక్రమాల జాడ కానరావడం లేదు. జిల్లాలో 13 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో సారా తయారీ, అమ్మకాలు, కేసుల నమోదు, బెల్ట్‌ దుకాణాల నిర్వహణ, తలెత్తే పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ‘జాగృతి’ కార్యక్రమం ముఖ్యోద్దేశం. అయితే జిల్లాలో అవగాహన కార్యక్రమాలు ఆయా స్టేషన్ల పరిధిలో ఎప్పుడు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి.

గతంలో జిల్లాలో సారా నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన నవోదయం కార్యక్రమంలో భాగంగా అధికారులు కొన్ని నెలలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏడాది గడిచిందో లేదో నవోదయంలో భాగంగా జిల్లాను సంపూర్ణ నాటుసారా నిర్మూలన ప్రాంతంగా మార్చామని అధికారులు ప్రకటనలు గుప్పించారు. అయితే జిల్లాలో అనేక ప్రాంతాల్లో నేటికీ సారా తయారీ, విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ‘జాగృతి’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నా జిల్లాలో యథేచ్ఛగా బెల్ట్‌ దుకాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో బెల్ట్‌ దుకాణాలను నిర్మూలిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీలు గుప్పించారు. కాని వాటి ఎత్తివేయడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి.

అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
జిల్లాలోని 13 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో జాగృతి కార్యక్రమాలు గత శనివారం నిర్వహించాం. అయితే ప్రభుత్వ ఆదేశాలు ఆకస్మికంగా రావడంతో సమాచారం అందించలేకపోయాం. ప్రతి శనివారం విధిగా అన్ని ఎక్సైజ్‌స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించేలా ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేస్తాం.   – ఎ.శంభూప్రసాద్, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, విజయనగరం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top