కదులుతున్న ఈఎస్‌ఐ స్కాం డొంక

Pitani Sathyanarayana Held in ESI Scam West Godavari - Sakshi

కొమ్ముచిక్కాల కేంద్రంగా పైరవీలు

చక్రం తిప్పిన పితాని కుమారుడు వెంకట్‌?

ఏసీబీకి చిక్కిన ఆధారాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు(పశ్చిమగోదావరి): రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టించిన ఈఎస్‌ఐ స్కాం మూలాలు జిల్లాలో బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పీఎస్‌ మురళీమోహన్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపింది. పితాని కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఈ వ్యవహారంలోచక్రం తిప్పినట్లు ఏసీబీ ఆధారాలు సంపాదించింది. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే భయంతో పితాని కుమారుడు వెంకట్, పితాని పీఎస్‌ మురళీమోహన్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మురళీమోహన్‌ను శుక్రవారం ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

10 శాతం కమీషన్‌ చెల్లిస్తేనే పనులు?
తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు హయాంలో మందుల కొనుగోలు, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున స్కాం జరిగింది. ఆ స్కాం పితాని సత్యనారాయణ హయాంలోనూ కొనసాగింది. పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మికశాఖలో ఏ పనిజరగాలన్నా మంత్రి కుమారుడు వెంకట్‌ కనుసన్నల్లోనే జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఏ కాంట్రాక్టు కావాలన్నా వెంకట్‌ను కలిసి పది శాతం చెల్లిస్తేనే పనులు జరిగినట్లుగా ప్రచారం జరిగింది.

తమ పనుల కోసం కాంట్రాక్టర్లు పితాని స్వగ్రామం కొమ్ముచిక్కాలకు క్యూ కట్టేవారు. పితాని వెంకట్‌ చీటీపై టెండర్లు ఎవరికి కేటాయించాలో రాసిచ్చేవారని, దాని ఆధారంగానే పనులు జరిగేవని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మంత్రి పీఎస్‌ కూడా కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి ఆధారాలు సంపాదించిన ఏసీబీ పితాని పీఎస్‌ మురళీమోహన్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుంది. మురళీమోహన్‌ సచివాలయంలోని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. (ఎందుకు దాస్తున్నారు?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top