చైర్మన్ పదవిపై మంత్రుల కొట్లాట
తమ వర్గీయులకే దక్కాలని మోహరించిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర
ఈ పదవికి రాంప్రసాద్‌ను ఎంపిక చేసిన మంత్రి రవీంద్ర
సీఎంతో చెప్పి నవీన్‌కుమార్‌ను ఎంపిక చేసి... బాధ్యతలు తీసుకునేలా చేసిన అచ్చెన్నాయుడు
కోర్టుకెళ్లి ఎన్నికలకు ఆదేశాలు తెచ్చిన రవీంద్ర వర్గీయులు
ఎలా నిర్వహిస్తారో చూస్తానంటూ నిప్పులు చెరుగుతున్న అచ్చెన్న
నా శాఖలో రవీంద్ర పెత్తనమేంటంటూ ఆగ్రహం
సాక్షి, అమరావతి: సీనియర్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య (ఆప్కాఫ్) చైర్మన్ పదవి విషయంలో ఇద్దరూ నువ్వా.. నేనా.. అ న్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మత్స్యశాఖలో కనీస అనుభవంలేని డోలా శంకర్‌ను ఆ శాఖ కమిషనర్‌గా నియమించడంతో మొదలైన వీరి పోరు ఆప్కాఫ్ పదవిపై కత్తులు దూసుకునే స్థాయికి చేరింది.
ఆది నుంచి కొల్లు రవీంద్రదే పెత్తనం
మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడైనా.. తొలినుంచి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఈ శాఖపై పెత్తనం చలాయిస్తున్నారు. వేటనిషేధ భృతి దగ్గర నుంచి కేంద్ర పథకాలకు అర్హుల ఎంపిక, నిధుల వ్యయం వరకు అన్నింటా కొల్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. తమ నియోజకవర్గానికి చెందిన డోలా శంకర్‌ను కమిషనర్‌గా నియమించుకోవడమేగాక.. వివిధ హోదాల్లో తన మనుషులకు మత్స్యశాఖలో రూ.లక్షల వేతనంతో కొలువులు కట్టబెట్టి వసూళ్లపర్వం సాగించారన్న ఆరోపణలున్నాయి.
కలెక్టర్ల సమావేశంలో డోలా పనితీరుపై సీఎం చంద్రబాబు కూడా మండిపడ్డారు. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారికి కమిషనర్ బాధ్యతలు అప్పగించాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రయతి్నంచగా.. రవీంద్ర మంత్రి లోకేశ్ ద్వారా చక్రం తిప్పారు. దాదాపు పదేళ్ల కిందట రిటైరైన రామశంకర్‌కు పునర్నియామకం ద్వారా కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. కొల్లు జోక్యంపై అచ్చెన్నాయుడు పలుమార్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.
మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా మంత్రి కొల్లు తన అనుచరుడైన కొల్లు పెద్దిరాజుకు దక్కేలా చేయగలిగారు. కార్పొరేషన్ పరిధిలో ఓడబలిజ, జాలారి, నెయ్యల, పట్టపు, గుండ్ల వంటి ఉపకులాలకు చెందిన వారిని కాదని కార్పొరేషన్‌తో సంబంధం లేని అగ్నికులక్షత్రియ వర్గానికి చెందిన నరసాపురం వాసి పెద్దిరాజుకు ఈ పదవి ఇవ్వడంపై అచ్చెన్నాయుడు విభేదించినా ఎవరూ పట్టించుకోలేదు.
సీఎం చెప్పినా.. కోర్టుకెక్కిన కొల్లు వర్గీయులు
నామినేటెడ్ పదవుల పందేరంలో భాగంగా మంత్రి లోకేశ్ అండదండలతో రవీంద్ర తన అనుచరుడైన కడప జిల్లా మత్స్యకార సంఘాల సమాఖ్య చైర్మన్ రాంప్రసాద్‌ను ఆప్కాఫ్ చైర్మన్‌గా అధిష్టానం ద్వారా ప్రకటింప చేయించుకున్నారు. తన శాఖలో మంత్రి కొల్లు జోక్యం ఏమిటో తేల్చాలంటూ మంత్రి అచ్చెన్న ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు.. రాంప్రసాద్‌ను పక్కనపెట్టి నంద్యాల ఎంపీ శబరి అనుచరుడైన కర్నూలు జిల్లా మత్స్యకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు నవీన్‌కుమార్‌ను ఆప్కాఫ్ చైర్మన్‌గా ఎంపిక చేశారు.
సీఎంవో ఆదేశాల మేరకు నియమితులైన నవీన్‌కుమార్ ఆప్కాఫ్ చైర్మన్‌గా బాధ్యతలు కూడా స్వీకరించారు. దీంతో రాంప్రసాద్‌ను బలపరుస్తున్న మంత్రి రవీంద్ర వర్గీయులైన జిల్లా సమాఖ్యల వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పదవికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. తనశాఖ మంత్రి అచ్చెన్నాయుడైనా.. తొలినుంచి మంత్రి కొల్లుకు వత్తాసు పలుకుతున్న మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్‌నాయక్ ఎన్నికల నిర్వహణకు సన్నద్దమయ్యారు.
జనవరి 8వ తేదీన ఆప్కాఫ్ జనరల్ బాడీ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీంతో ‘నా అనుమతి లేకుండా.. నాకు తెలియకుండా.. నా శాఖ పరిధిలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో చూస్తా..’ అంటూ అచ్చెన్నాయుడు నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలవాలని రాష్ట్రంలోని 13 జిల్లా సమాఖ్య చైర్మన్లను తమ వైపు తిప్పుకునేందుకు రాంప్రసాద్, నవీన్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఓటుకు రూ.5 లక్షల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు నిర్వహించాలని, నిలిపేయాలని మంత్రులు ఎవరికివారు ప్రయత్నిస్తున్నారు.
రూ.కోట్లు కొల్లగొట్టేందుకే ఆప్కాఫ్‌పై పెత్తనం
ఏపీ సహకార సంఘాల చట్టం–1964 ద్వారా 1987లో ఏర్పాటైన ఆప్కాఫ్.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 2,136 మత్స్య సహకార సొసైటీలు, వాటి పరిధిలో ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుంది. వేటకు వెళ్లే బోట్లకు సబ్సిడీ డీజిల్ ఆయిల్ సరఫరా చేసే అవుట్‌లెట్స్, వాటి మార్కెటింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఆప్కాఫ్‌కు మత్స్యశాఖ అదనపు డైరెక్టర్ ఎండీగా వ్యవహరిస్తుండగా, బైలా ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్లను జిల్లా సమాఖ్యల ద్వారా ఎన్నకుంటారు.
ప్రాథమిక మత్స్య సహకార సొసైటీలను ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎఫ్‌పీవో)లుగా అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల కిందట ఆప్కాఫ్‌కు జాతీయ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) రూ.1,274 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.637 కోట్లు విడుదల కూడా చేసింది. వీటిని ఎంపిక చేసిన 182 ప్రాథమిక మత్స్య సహకార సొసైటీలను ఎఫ్‌ఎఫ్‌పీవోలుగా అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేయాల్సి ఉంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్టు పేరు చెప్పి 50 మందికి పైగా తమ అనుచరులను నియమించుకున్నారు. వీరికి పైసా పనిలేకున్నా రూ.లక్షల జీతాలిస్తున్నారు. ఈ నిధులపై కన్నేసినందునే మంత్రులు ఈ శాఖపై పెత్తనం కోసం ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి.


