
సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ఓ అడవి పంది గురువారం హల్ చల్ చేసింది. బస్టాండ్‌లోకి వచ్చి ప్రయాణికుల్ని పరుగులు పెట్టించింది. అకస్మాత్తుగా ప్రయాణికులపై దాడి చేసి ముగ్గుర్ని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో ఓ మహిళ చేతికి తీవ్రగాయమైంది. ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించి అడవి పందిని రాళ్లతో బయటకు తరిమికొట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గాయపడిన మహిళను 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అడవి పంది విషయం అటవీ శాఖాధికారులకు తెలియజేయడంతో వారు వలతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పందిని పట్టుకోవడానికి అటవీశాఖ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆఖరికి జాలీ వేసి పట్టుకుని అడవికి తరలించారు.