డబ్బు ఇవ్వలేదని కొట్టి చంపేశారు

Person Brutually Murdered For Not Giving Money In Bobbili Town - Sakshi

సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : మండలంలోని నారసింహునిపేట సమీపంలో నంద చెరువు వద్ద సీతానగరం మండలం గుచ్చిమికి చెందిన దుస్తుల వ్యాపారి కింతలి నాగేశ్వరరావు మంగళవారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మిస్టరీని ఏఎస్పీ గౌతమీశాలి ఆధ్వర్యంలో పోలీసులు రెండు రోజుల వ్యవధిలో ఛేదించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ  వివరాలు వెల్లడించారు. కింతలి నాగేశ్వరరావు దుస్తులు విక్రయించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.

ఇతను అదే గ్రామానికి చెందిన బలగ రామినాయుడుకు రూ. రెండు లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇటీవల కాలంలో తన సొమ్ము తిరిగి ఇచ్చేయాలని తరచూ నాగేశ్వరరావు అడుగుతుండడంతో రామినాయుడు కక్ష పెంచుకున్నాడు.  ఎలాగైనా నాగేశ్వరరావును అంతమొందించాలని భావించిన రామినాయుడు తనకు తెలిసిన సుంకరి వాసు, జాగాన సత్యనారాయణలతో బేరం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం ఒక్కొక్కరికీ రెండు వేల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించి.. హత్య చేసిన తర్వాత రూ. 75 వేలు ఇవ్వడానికి రామినాయుడు ఒప్పుకున్నాడు.

దీంతో నిందితులు ముందుగా కింతలి నాగేశ్వరరావు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో రెక్కీ నిర్వహించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రానికి నారసింహునిపేట వైపు నాగేశ్వరరావు వస్తాడని నిర్ణయించుకున్న నిందితులు ముందుగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతలో అటుగా వస్తున్న నాగేశ్వరరావుపై నిందితులు కర్రలతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేసి రెండు ఉంగరాలు, పర్స్, సెల్‌ఫోన్‌ తీసుకెళ్లిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి  వివరాలు సేకరించారు. సమీపంలోని మూడు పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించి పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన కర్ర స్వాధీనం చేసుకున్నారు.  

సిబ్బందికి అభినందనలు.. 
హత్య కేసును త్వరగా ఛేదించిన బొబ్బిలి, బాడంగి, సీతానగరం ఎస్సైలు వి. ప్రసాదరావు, బి. సురేంద్ర నాయుడు,  జి.కళాధర్‌తో పాటు బొబ్బిలి నూతన ఎస్సై ఎస్‌. కృష్ణమూర్తి, బొబ్బిలి  ఏఎస్సైలు బీవీ రమణ, వై. మురళీకృష్ణ, జి. శ్యామ్‌సుందరరావు, పీసీలు కె. తిరుపతిరావు, యు. తాతబాబునాయుడు, బి. కాసులరావు, వి. శ్రీరామ్, వై. శ్యామలరావు, కె.పూడినాయుడులను ఏఎస్పీ అభినందించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top