లొంగిపోయిన ఆశిష్‌ పాండే

Pandey Surrenders In Delhi Court  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన బీఎస్పీ మాజీ ఎంపీ కుమారుడు రాకేశ్‌ పాండే కుమారుడు అశిష్‌ పాండే గురువారం పాటియాలా హౌస్‌ కోర్టులో లొంగిపోయారు. ఆయనను న్యాయస్థానం ఒకరోజు పోలీసు కస్టడీకి అప్పగించింది. నాలుగు రోజులు కస్టోడియల్‌ రిమాండ్‌కు ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. అశిష్‌ పాండేను లక్నో తీసుకెళ్లాల్సిన అవసరముందని, తుపాకీ స్వాధీనం చేసుకోవాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పేర్కొన్నారు. పాండేను రిమాండ్‌కు ఇవ్వాలన్న వాదనను ఆయన తరపు న్యాయవాది వ్యతిరేకించారు. విచారణకు పాండే సహకరిస్తున్నారని, తుపాకీని కూడా పోలీసులకు అప్పగించామని తెలిపారు. తన క్లైయింట్‌ తండ్రి రాజకీయ నాయకుడు కావడం వల్లే ఈ ఘటనపై మీడియా అత్యుత్సాహం చూపించిందన్నారు. (ప్రాథమిక వార్త: తుపాకీతో మాజీ ఎంపీ కొడుకు హల్‌చల్‌!)

మీడియా బాధితుడిని: పాండే
తాను బాధ్యత గల పౌరుడినని, నేరస్తుడిని కాదని అశిష్‌ పాండే అన్నారు. ప్రసార సాధనాలు ఏకపక్షంగా వ్యవహరించాయని, తాను మీడియా విచారణనకు బాధితుడిని అయ్యాయని వాపోయారు. సీసీ టీవీ ఫుటేజీని లోతుగా పరిశీలించాలని, హోటల్‌ సెక్యురిటీ సిబ్బంది నుంచి వివరాలు సేకరించాలని పోలీసులను కోరారు. కాగా, తనకు దారివ్వలేదన్న కోపంతో ఓ జంటను తుపాకీతో బెదిరించినట్టు పాండే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top